Krishnam Raju : తెలుగు చలన చిత్ర రంగంలో రెబల్ స్టార్ గా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు. ఉభయగోదావరి జిల్లాలతో ఆయనకు ఎనలేని అనుబంధం ఉంది. 1940 జనవరి 20న మొగల్తూరులో జన్మించిన ఆయన పుట్టి పెరిగింది పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, భీమవరం ప్రాంతాల్లో కాగా ఆయన బాల్యం, టీనేజ్ అంతా కూడా పశ్చిమగోదావరి జిల్లాలోనే సాగింది. 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి వాజ్ పేయీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ తరువాత ఇదే స్థానం నుంచి 2004లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కృష్ణంరాజు ఓటమి చవిచూశారు. ఇక సాంస్కృతిక నగరంగా పేరు పొందిన రాజమండ్రి నుంచి 2009లో ఆయన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణంరాజు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన నాయకులతో, సన్నిహితులతో నిత్యం టచ్ లో ఉంటూ ఉండేవారు. వివాహ వేడుకలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భీమవరం, మొగల్తూరు, రాజమండ్రి, అమలాపురం పరిసర ప్రాంతాలకు అనేక సార్లు కుటుంబ సమేతంగా వచ్చేవారు.


గోదావరి జిల్లాలతో అనుబంధం 


తెలుగు చిత్ర పరిశ్రమకు గోదావరి అద్భుత అందాలు ఎంతటి ఖ్యాతినిచ్చాయో చెప్పనవసరం లేదు. కృష్ణంరాజు నటించిన ఎన్నో హిట్ చిత్రాలన్నీ రాజమండ్రి గోదావరి తీరంలోనే చిత్రీకరణ జరుపుకున్నాయి. సమాజ మార్పుకోసం పరితపించే ఉపాధ్యాయుని పాత్రలో ఒదిగిపోయిన త్రీశూలం చిత్రం షూటింగ్ దాదాపు 80 శాతం అంతా రాజమండ్రి గోదావరి తీర గామాల్లోనే జరిగింది. అప్పట్లో జయసుధ, శ్రీదేవిలతో కలిసి నటించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు రాజమండ్రిలోనే చాలా కాలం ఉండిపోయారు. ఇక గోదావరి తీరంలోనే ఎక్కువ షూటింగ్ పూర్తిచేసుకున్న అమరదీపం, సీతారాములు, శివమెత్తిన సత్యం, కటకటాల రుద్రయ్య, మనవూరి పాండవులు తదితర చిత్రాలు ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువ షూటింగ్ పూర్తిచేసుకున్నాయి. ఇక కోనసీమలోనూ కృష్ణంరాజుకు మంచి అనుబంధం ఉంది. అప్పటి సత్యం కంప్యూటర్స్ అధినేతలైన రామలింగరాజు సోదరులు స్థాపించిన బైర్రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పలు సేవా కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 


ఉభయగోదావరి జిల్లాల్లో సంతాప శిబిరాలు 


రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఉభయగోదావరి జిల్లాల్లోని ఆయన అభిమానులు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ పాటు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, అమలాపురం, ముమ్మిడివరం, ఐ.పోలవరం, ఆత్రేయపురం తదితర ప్రాంతాల్లో సంతాప శిబిరాలు ఏర్పాటు చేసి కృష్ణంరాజు మృతికి నివాళులర్పిస్తున్నారు. 


రెబల్ స్టార్ రాజకీయ ప్రస్థానం


 1970, 1980లలో కృష్ణంరాజు కెరీర్ ఓ రేంజ్‌లో సాగిపోయింది. అనంతరం ఆయన రాజకీయాలవైపు మొగ్గుచూపారు. కృష్ణంరాజు 1991లో మొదట కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓటమిపాలయ్యారు. దాంతో కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. 1998లో రీ ఎంట్రీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు.