TTD Job Scam : టీటీడీలో ఉద్యోగం చేయాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలని అంటుంటారు. శ్రీనివాసుడి సన్నిధిలో ఉద్యోగం సంపాదించాలంటే అంతా సులువుగా సాధ్యం అయ్యే పనికాదు. కానీ ఓ యువకుడు టీటీడీలో ఉద్యోగిని అంటూ కలరింగ్ ఇస్తూ, తాను చెబితే ఇట్టే టీటీడీలో ఉద్యోగం ఇస్తారంటూ మాయ మాటలు చెప్పాడు. నకిలీ టీటీడీ ఉద్యోగి కార్డును చూపిస్తూ ప్రతి రోజు తిరుమలకు వస్తూ నిరుద్యోగ యువతను టార్గెట్ గా చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కోటి ముప్ఫై లక్షల రూపాయలు దోచుకున్న ఘటన ప్రస్తుతం తిరుమలలో చర్చనీయాంశంగా మారింది.


అసలేం జరిగింది? 


 తిరుపతిలోని కొరమేనుగుంటకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి తాను టీటీడీ ఉద్యోగిని అంటూ అందరినీ నమ్మించాడు. అదే నమ్మకాన్ని క్యాష్ చేసుకోవాలని పన్నాగం పన్నాడు. జల్సాలకు అలవాటు పడిన బాలకృష్ణ ఎలాగైనా కోట్ల రూపాయలు సంపాదించాలని మరి కొందరితో కలిసి పథకం రచించాడు. పక్కా ప్లాన్ తో చుట్టు పక్కల వారిని, తెలిసిన వారిని టీటీడీలో ఉన్నతాధికారినంటూ నమ్మించాడు. అంతే కాకుండా టీటీడీలో ఉద్యోగాలు ఇప్పించే హోదాలో తాను ఉన్నానంటూ నిరుద్యోగ యువతను టార్గెట్ గా చేసుకుని వలపన్నాడు. దేవస్థానంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తాను చెబితే ఉద్యోగం కచ్చితంగా వస్తుందని నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పాడు. అయితే ఉద్యోగాలు ఇవ్వాలంటే కొంత మొత్తంలో నగదు ఇవ్వాలని చెప్పి ఒక్కొక్కరి వద్ద లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఉద్యోగం కోసం కొంత కాలం పాటు వెయిట్ చేయాలని చెప్పి ఏళ్ల తరబడి కాలం గడుపుతూ వచ్చేవాడు. గట్టిగా ప్రశ్నించిన వారికి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు అందించాడు. 


 ఎంపీ కారు స్టిక్కర్ కూడా 


నకిలీ ఉద్యోగ ధ్రువపత్రాలు పొందిన కొందరు యువకులు టీటీడీ అధికారులను కలిసి తనకు ఉద్యోగం వచ్చిందని చెప్పడంతో బాలకృష్ణ మోసం గుట్టురట్టు అయ్యింది. మోసపోయాం అని తెలుసుకున్న యువకులు నేరుగా టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు బాలకృష్ణను చాకచక్యంగా  అదుపులోకి తీసుకుని విచారించారు. కొందరు నిరుద్యోగ యువత వద్ద నుంచి దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలు నగదు తీసుకుని మోసగించినట్లు విచారణలో వెల్లడైంది. అంతే కాకుండా బాలకృష్ణ వద్ద నుంచి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, రబ్బరు స్టాంపులు, టీటీడీ అధికారుల ఫోర్జరీ సంతకాలతో కూడిన పత్రాలు, నకిలీ ఎంపీ కారు స్టిక్కర్ ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బాలకృష్ణతో పాటుగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరి కొందరి కోసం టీటీడీ విజిలెన్స్ అధికారులు గాలిస్తున్నారు. అంతే కాకుండా నకిలీ టీటీడీ ఉద్యోగి పేరిట చలామణి అవుతున్న బాలకృష్ణ వద్ద నుంచి ఓ కారును కూడా విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. 


Also Read : East Godavari Crime : భూమి కోసం ఊరికొస్తే, సెప్టిక్ ట్యాంకులో పూడ్చిపెట్టారు-కాకినాడ జిల్లాలో దారుణం!


  Also Read : Hyderabad Crime : హైదరాబాద్ లో యువతి మిస్సింగ్ విషాదాంతం,పెళ్లికి నిరాకరించిందని ప్రియుడే ఘాతుకం