Hyderabad Crime : హైదరాబాద్ కాటేదాన్ లో అదృశ్యమైన యువతి సాయిప్రియ ఘటన విషాదాంతం అయింది. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడే ఆమెను దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. మాట్లాడాదామని సాయి ప్రియను తీసుకెళ్లిన శ్రీశైలం హత్య చేసి పరారయ్యాడు. కాటేదాన్‌లోని టీఎన్జీవోస్ కాలనీలో ఉంటున్న సాయిప్రియ సెప్టెంబర్ 5న కాలేజికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. అలా బయటకు వెళ్లిన సాయి ప్రియ ఇంటికి ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయిప్రియ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సాయిప్రియ మాజీ ప్రియుడు శ్రీశైలంపై అనుమానంతో కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో శ్రీశైలం యువతిని హత్య చేసినట్లు గుర్తించారు.
పెళ్లికి నిరాకరించడంతో
సాయిప్రియ పెళ్లికి నిరాకరించిందని కక్ష పెంచుకున్నాడు శ్రీశైలం. తన మాట వినడంలేదని దారుణానికి ఒడిగట్టాడు. సాయిప్రియతో ఒకసారి మాట్లాడుకుందాం అని బయటకు పిలిచాడు. ఆ మాటలు నమ్మిన యువతి అతడితో బయటకు వెళ్లింది. ఆమె ముందు పెళ్లి ప్రస్తవన మళ్లీ తెచ్చాడు శ్రీశైలం అందుకు ఆమె నిరాకరించడంతో చున్నీతో గొంతు నులిమి సాయి ప్రియను హత్య చేశాడు. ఆ తర్వాత మరో వ్యక్తి సాయంతో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టేశాడు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం మానాజీపేట గ్రామంలో యువతి మృతదేహం దొరికిందని పోలీసులు తెలిపారు.
అలా మొదలైంది
మానాజీపేటకు చెందిన అంజన్న శంషాబాద్ సమీపంలో కుటుంబంతో ఉంటున్నాడు. అంజన్న చిన్న కుమారుడు శ్రీశైలానికి స్నేహితుల ద్వారా హైదరాబాద్‌లో కాటేదాన్‌కు చెందిన సాయిప్రియ (20)తో పరిచయం ఏర్పడింది. అయితే పరిచయం ప్రేమగా మారింది. వారి ప్రేమ విషయాన్ని శ్రీశైలం ఇరు కుటుంబ సభ్యులకు చెప్పాడు. సాయి ప్రియ కుటుంబ సభ్యులు వారి ప్రేమకు అంగీకరించలేదు. తల్లిదండ్రులు నో చెప్పడంతో సాయి ప్రియ శ్రీశైలంతో మాట్లాడటం మానేసింది. కరోనా సమయంలో శ్రీశైలం కుటుంబం వారి సొంతూరు మానాజీపేటకు వచ్చేశారు.
చున్నీతో గొంతు బిగించి హత్య
అయితే మూడు నెలల క్రితం సాయిప్రియ, శ్రీశైలం మధ్య మాటలు మొదలయ్యాయి. ఒకసారి కలిసి మాట్లాడుకుందామని చెప్పడంతో ఈ నెల 5న సాయిప్రియ భూత్పూర్ కు వచ్చింది. అక్కడి నుంచి శ్రీశైలం తమ బైక్ పై మానాజీపేటకు సాయి ప్రియను తీసుకెళ్లాడు. గ్రామంలోని ఓ చోటుకు తీసుకెళ్లి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. యువతి నిరాకరించడంతో గొడవ జరిగింది. ఆగ్రహంతో శ్రీశైలం సాయిప్రియను చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం శ్రీశైలం తన బంధువు శివతో కలిసి కేఎల్ కాల్వ దగ్గర గొయ్యి తవ్వి సాయిప్రియ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. బయటకు వెళ్లిన కూతురు ఇంటికి తిరిగి రాకపోయేసరికి సాయి ప్రియ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది.
Also Read : Gadwal Road Accident: గద్వాల జిల్లాలో రోడ్డుప్రమాదం - ఇద్దరు అక్కడికక్కడే మృతి, మరొకరికి తీవ్ర గాయాలు