Road Accident at Erravalli Chowrasta: అతివేగం, ఓవర్ టెక్ చేయాలనే ప్రయత్నాలతో నిత్యం ఏదో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోని గోశాల వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బైక్, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
అసలేం జరిగింది..
ముగ్గురు వ్యక్తులు బైక్‌పై ప్రయాణిస్తున్నారు. ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోని గోశాల వద్ద ముందు వెళ్తున్న డీసీఎంను ఓవర్ టేక్ చేయాలని చూడగా, బైక్ అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టింది. దీంతో బైకు మీద ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికుల నుంచి సమాచారం అందుకున్న ఇటిక్యాల ఎస్ఐ గోకారి, మరికొందరు పోలీసులతో అక్కడికి చేరుకుని పరిశీలించారు.
ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్గం కోసం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం కర్నూల్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మృతులు ఐజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి, ఐజ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన చంద్రకళగా గుర్తించారు పోలీసులు. గాయపడిన మహిళను తనగల గ్రామానికి చెందిన మంజులగా పోలీసులు నిర్ధారించారు. చనిపోయిన మహిళ చంద్రకళ గద్వాలలోని ఓ హాస్పిటల్‌లో ఏఎన్ఎంగా పని చేస్తున్నారు. బైక్ నంబర్ – AP 21 AB 2579 అని పోలీసులు నోట్ చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హాస్టల్‍లో విద్యార్థి మృతి, వార్డెన్ సస్పెండ్
కామారెడ్డి జిల్లాలోని బిర్కూర్ బీసీ బాలుర హాస్టల్ లో ఓ విద్యార్థి చనిపోయాడు. దుర్కి గ్రామానికి చెందిన సాయిరాజ్ బిర్కూర్ బీసీ హాస్టల్ లో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో సాయిరాజ్ కు వాంతులు అవడంతో హాస్పిటల్ కు తరలించారు. శనివారం ఉదయం 5 గంటలకు విద్యార్థి చనిపోయాడని సాయిరాజ్ కుటుంబ సభ్యులకు హాస్టల్ సిబ్బంది తెలిపారు. పాము కరిచిందని హాస్టల్ సిబ్బంది తెలిపారని సాయిరాజ్ కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే తమ కుమారుడి మృతిపై ఒక్కోసారి ఒక్కో కారణం చెప్పడంతో వీరు అనుమానాలు వ్యక్తం చేశారు. హాస్టల్‌కు చేరుకున్న సాయిరాజ్ కుటుంబ సభ్యులు, తమ కుమారుడి మరణంపై హాస్టల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు విద్యార్థి సాయిరాజ్ మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
వార్డెన్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్
బిర్కూర్ బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థి మృతి చెందడంతో వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. హాస్టర్ వార్డెన్ సందీప్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ వి జితేష్ పాటిల్ తెలిపారు. వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి మృతి చెందాడని, చర్యలలో భాగంగా వార్డెన్‌ను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. సాయి రాజ్ మృతిపై త్వరలోనే విచారణ చేయిస్తామని కలెక్టర్ తెలిపారు.