బ్రెడ్ మీద బటర్ రాసుకుని తింటే ఆ రుచే వేరు. బటర్ కోసం ఎక్కువ మంది బయట మార్కెట్లో దొరికే వాటికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే నెయ్యి నుంచి బటర్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంట్లో తయారు చేసిన ఆహారాలను ఎక్కువగా ఆస్వాదించడానికే చాలా మంది ఇష్టపడతారు. అందుకే చపాతీలు, పరోటాలు, బటర్ నాన్ లు చేసుకోవడానికి బయట నుంచి బటర్ తెచ్చుకుంటారు. బ్రాండ్స్ పేరుతో కొంతమంది కల్తీ ఆహారం అమ్ముతూ ఉంటారు. అది నిజమే అనుకుని కొనుగోలు చేసి తింటారు. కానీ వాటి వల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వచ్చి అనారోగ్యం పాలవుతారు. స్టోర్ లో కొన్న వెన్నలాగా రుచిగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తే కేవలం ఒక గంటలో మీకు ఎంతో రుచిగా మంచి సువాసన వచ్చే వెన్న రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడ వెన్న మాత్రం నెయ్యి నుంచి వస్తుంది. అదేంటి వెన్న నుంచి కదా నెయ్యి వచ్చేది అనుకుంటున్నారా అదేనండీ మరి ఇక్కడ విచిత్రం. అందుకే ఇది వైరల్ బటర్ అయ్యింది. మరి అది ఎలా తయారు చెయ్యాలో చూసేద్దామా..


కావాల్సిన పదార్థాలు


ఇంట్లోనే సులభంగా వెన్న తయారు చెయ్యడానికి కేవలం 5 పదార్థాలు కావాలి.


నెయ్యి


ఉప్పు


పసుపు


వేడి నీళ్ళు


బేకింగ్ సోడా/ ఫ్రూట్ సాల్ట్


ఐస్ క్యూబ్స్


తయారీ విధానం 
ఒక పెద్ద గిన్నెలో 2-3 కప్పుల వేడి నీటిని తీసుకోవాలి. మరొక గిన్నెలో ఒక కప్పు నెయ్యి తీసుకుని దాన్ని వేడి నీటి గిన్నెలో పెట్టాలి. నెయ్యి గడ్డగా కాకుండా కాస్త కరిగే ఉండాలి. ఆ గిన్నె స్టవ్ మీద మాత్రం పెట్టకూడదు. నెయ్యి పూర్తిగా కరిగిపోవడానికి 2-3 నిమిషాలు టైమ్ పడుతుంది. నెయ్యి కరిగిన తర్వాత దాన్ని మరొక గిన్నెలోకి మార్చుకోవాలి. కరిగించిన నెయ్యిలో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలపాలి. తర్వాత ఆ నెయ్యిలో ఫ్రూట్ సాల్ట్/బేకింగ్ సోడా కలపండి. ఆ మిశ్రమం మొత్తం బాగా కలపాలి. తర్వాత ఈ గిన్నెలో 6-7 ఐస్ క్యూబ్స్ వేసి, ఒక స్పూన్ తీసుకుని దాన్ని బాగా కలపండి. వెన్న తయారు చేయడానికి మీరు మీ చేతులను కూడా ఉపయోగించవచ్చు. ఐస్ క్యూబ్స్ నెయ్యిని ముద్దగా చెయ్యడంలో సహాయపడతాయి. ఇది తాజా వెన్నను తయారు చేస్తుంది.


గట్టిపడిన మిశ్రమం నుంచి వెన్నని వేరు చేసి వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఒక బీటర్ తీసుకుని మెత్తగా వచ్చేలాగా తిప్పాలి. బాగా నురగగా వచ్చిన తర్వాత రంగు కూడా మారుతుంది. ఈ వెన్నని బటర్ డిష్ లేదా కంటైనర్ లోకి మార్చి ఒక గంట పాటు ఫ్రిజ్ లో పెట్టాలి. తర్వాత దాన్ని బయటకి తీస్తే అచ్చం బయట స్టోర్స్ లో లభించే బటర్ లాగా చాలా కనిపిస్తుంది. ఎంతో రుచిగా కూడా ఉంటుంది.


Also read: జ్వరం వచ్చినప్పుడు గుడ్లు, చేపలు, మాంసం తినవచ్చా?


Also read: ఈ డైట్ ప్లాన్ పాటిస్తే వారం రోజుల్లో డయాబెటిస్ అదుపులోకి రావడం ఖాయం