Bihar News:
సీసీ కెమెరాలో రికార్డ్..
కింది స్థాయి ఉద్యోగులు సరిగా పని చేయకపోతే...కాస్త మందలిస్తారు. లేదంటే అర్థమయ్యేట్టు చెబుతారు. కానీ...బిహార్‌లోని ఓ పోలీస్ ఆఫీసర్ మాత్రం...అందరూ తిట్టుకునే పని చేశాడు. బిహార్‌లోని నవాడా జిల్లా ఎస్‌పీ...తన కింద పని చేసే ఐదుగురు పోలీసులను దాదాపు 2 గంటల పాటు లాకప్‌లో బంధించాడు. సరిగా పని చేయటం లేదన్న కోపంతో ఇలా చేశాడట. లాకప్‌లోని సీసీ కెమెరాలో...ఆ ఐదుగురు పోలీసులు బందీలుగా ఉన్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. వీడియోలో ఆ ఐదుగురు పోలీసులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. నవాడా ఎస్‌పీ గౌరవ్ మంగళ చేసిన పని ఇది. ఈ 5గురిలో...ముగ్గురు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. గురువారం రాత్రి వారిని ఇలా లాకప్‌లో ఉంచాడు ఎస్‌పీ. అయితే...దీనిపై ఎస్‌పీని ప్రశ్నించగా.. అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పారేశాడు. ఉన్నతాధికారులు కూడా ఇంత వరకూ దీనిపై స్పందించలేదు. అయితే..బిహార్ పోలీస్ అసోసియేషన్ మాత్రం ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించింది. దీనిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..
అసోసియేషన్ ప్రెసిడెంట్ మృత్యుంజయ్ కుమార్ సింగ్...ఎస్‌పీతో మాట్లాడేందుకు ప్రయత్నించినా...ఆయన నిరాకరించారు. ఫోన్ కాల్స్ చేసినా అటెండ్ చేయలేదు. "నవాడా పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరగ్గానే మాకు సమాచారం అందింది. మా వాట్సాప్ గ్రూప్‌లలో కూడా దీనిపై డిస్కషన్ జరిగింది. ఇలాంటి ఘటనలు వలసవాదం నాటి రోజుల్ని గుర్తు చేస్తాయి. బిహార్ పోలీసుల గౌరవానికి భంగం కలిగించింది. సీసీటీ ఫుటేజ్ ఆధారంగా న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం" అని మృత్యుంజయ్ అన్నారు. ఓ కేసు విషయంలో ఈ ఐదుగురిపై ఎస్‌పీ కావాలనే ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలున్నట్టు ఆయన చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలనూ చెరిపేసేందుకు ఆయన ప్రయత్నిస్తాడని ఆరోపించారు. కేసు నమోదు చేసి వీలైనంత త్వరగా విచారణ చేపట్టాల్సిందేనని అన్నారు. బిహార్ చీఫ్ సెక్రటరీ అమీర్ సుబానీ ఈ మ్యాటర్‌ని సీరియస్‌గా తీసుకున్నారు. ఉద్యోగులతో సక్రమంగా నడుచుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఎలాంటి కారణం లేకుండా దూషించడం, ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తే సహించేది లేదని చాలా కఠినంగా చెప్పారు. ఎస్‌పీని సస్పెండ్ చేయడమే కాకుండా మానసికంగా వేధించినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.