విశాఖపట్నం–రాయ్‌పూర్ ఆర్థిక కారిడార్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. తూర్పు తీరం నుంచి అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర స్థాయి కార్గో రవాణాకు విశాఖ ప్రధాన కేంద్రం. విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌ను అనుసంధానిస్తూ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి చేపట్టనున్నారు. భారత్‌మాల ప్రాజెక్టు మొదటి దశ కింద 464 కి.మీ. మేర ఆరు లేన్ల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చర్యలు చేపట్టింది. రవాణాకు కీలకమైన విశాఖ-రాయ్ పూర్ ఎకనామిక్ కారిడార్‌కు ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళిక రూపొందించింది. దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు.
Also Read: దాడులకు భయపడేది లేదు ...నేనే స్వయంగా రోడ్లపైకి వస్తా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్
విజయనగరం, విశాఖలో భూసేకరణ
రాయ్‌పూర్ నుంచి ఒడిశా మీదుగా విశాఖపట్నం సబ్బవరం వరకు 464 కి.మీ. మేర గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించేందుకు ఎన్ హెచ్ఏఐ ప్రణాళిక చేపట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో 124 కి.మీ, ఒడిశాలో 240 కి.మీ, ఏపీలో 100 కి.మీ. మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కోసం ఒడిశాలో అటవీ భూముల సేకరణకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చింది. మూడు ప్యాకేజీల కింద ఈ రహదారి పనులు చేపట్టనున్నారు. డీపీఆర్ రూపొందించేందుకు టెండర్లు ఇచ్చింది. ఏపీలోని విజయనగరం జిల్లా సాలూరు నుంచి విశాఖ జిల్లా సబ్బవరం వరకు ఈ హైవేను నిర్మిస్తారు. ఏపీలో నిర్మించే ఆరు వరుసల రహదారికి రూ.3,200 కోట్ల అంచనాతో ప్రణాళిక ఖరారు చేశారు. దాదాపు 2 వేల ఎకరాలను సేకరించాలని ఎన్ హెచ్ఏఐ భావిస్తుంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో దాదాపు 1300 ఎకారలు సేకరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు భూసేకరణకు విజయనగరం, విశాఖ జిల్లాలో సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read: ‘బిగ్ బాస్ 5’ అరుదైన రికార్డ్.. దేశంలో 2 స్థానంలో తెలుగు రియాల్టీ షో
పారిశ్రామిక కేంద్రాల అనుసంధానం
రాయ్‌పూర్– విశాఖ ఎకనామిక్ కారిడార్ పారిశ్రామికాభివృద్ధికి దిక్యూచిలా మారనుంది. కార్గో రవాణాకు కీలకంగా మారనుంది. విశాఖపట్నం, గంగవరం పోర్టుల నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు కార్గో రవాణాకు ఈ రహదారి కీలకం కానుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్, ఛత్తీస్‌గఢ్ భిలాయి స్టీల్‌ప్లాంట్, బైలదిల్లాలోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఒడిశాలోని దామంజోడిలోని నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్, సునాబెడలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పారిశ్రామిక కేంద్రాలను ఈ రహదారి అనుసంధానించనుంది.
Also Read: అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం ! చక్కదిద్దుకునేందుకు సలహాదారు నియామకం..!