Low pressure area likely to form over Bay of Bengal | అమరావతి: రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో నేడు (సెప్టెంబర్ 23న) పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తాజా అల్పపీడనం ప్రభావంతో సోమవారం, మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. 


ఇటీవల కురిసిన వర్షాలతో కాలువలు, నదులు, రిజర్వాయర్లు నిండాయని.. తాజాగా కురవనున్న వర్షాలతో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కనుక వర్షం కురుస్తున్న సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు పోల్స్, టవర్స్ క్రింద, చెట్లు క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ సూచించారు. 


సోమవారం, సెప్టెంబర్‌ 23న ఆ జిల్లాల్లో వర్షాలు
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వీటితోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. తూర్పు గోదావరి, కాకినాడ, అన్నమయ్య, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.  






మంగళవారం, సెప్టెంబర్‌ 24న ఆ జిల్లాల్లో వర్షాలు
పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో సెప్టెంబర్ 24న అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం మన్యం, తూర్పు గోదావరి,  కోనసీమ, కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలున్నాయి.


బుధవారం, సెప్టెంబర్‌ 25న ఆ జిల్లాల్లో వర్షాలు
సెప్టెంబర్ 25న అల్పపీనడం వాయుగుండంగా మారడంతో తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. వీటితోపాటు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.


తెలంగాణలోనూ వర్షాలు


ఎగువ గాలులలో కొనసాగిన ఆవర్తనంతో నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో,  నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో దిగువ ట్రోపో వాతావరణంలో గాలులు వీచనున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురవగా.. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సోమ, మంగళవారాల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  






తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవనుంది. ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, మహబూబ్ నగర్ లలో అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. హైదరాబాద్ లో గంటలకు 8 - 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు దిగిరావడంతో ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. మరో మూడు, నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉండి ఏ సమయంలోనైనా వర్షం కురవనుంది.