Purandeswari: ఏపీ సర్కారు మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. ఏపీలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు ఇవ్వగలరా అని మేం సవాల్ విసిరాం.. కానీ ప్రభుత్వం స్పందించ లేదvdvejg. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వద్ద 100కు డిస్టలరీ కంపెనీల నమోదయ్యాయి. కానీ 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయని ఆరోపించారు. అదాన్ డిస్టలరీస్ 2019లో మొదలైంది. రూ. 1164 కోట్ల మేర మద్యం సరఫరా ఆర్డర్ అదాన్ కంపెనీకే ఉన్నాయన్నారు. అదాన్ కంపెనీ వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారని.. ఈ రెండు కంపెనీలను అదాన్ బలవంతంగా చేజిక్కించుకుందని ఆరోపించారు.
సీఎం సన్నిహితుల చేతుల్లోకే మద్యం బినామీ కంపెనీలు
ఎస్పీవై అగ్రస్ సంస్థకు రూ. 1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్స్ ఉన్నాయని, ఈ సంస్థ వెనుక మిధున్ రెడ్డి ఉన్నారని పురంధరేశ్వరి ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో పెర్ల్ డిస్టలరీస్ దీన్ని సీఎం జగన్ సన్నిహితులు బలవంతం పెట్టి సబ్ లీజుకు తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే కంపెనీల జాబితా.. ఆ కంపెనీల ఓనర్ల జాబితా ఇవ్వాలంటే ఇవ్వలేదని, ఇప్పుడు మేమే ఆ వివరాలు బయట పెట్టామన్నారు. దశలవారీ మద్య నిషేధం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, మద్యం తయారీదారులు, అమ్మకం దారులను ఏడేళ్ల పాటు జైలుకు పంపుతామన్నారని.. ఇప్పుడు మద్యం తయారీదారుల జాబితా విడుదల చేశామని.. వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని పురంధరేశ్వరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మద్యం కంపెనీలపై చర్యలు ఎప్పడు తీసుకుంటారు ?
మద్యం కంపెనీలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. లెక్కల్లోకి రాని మద్యం డబ్బుల లెక్కలేవని ప్రశ్నించారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి మరీ మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఆరోపించారు. ఫోన్ పే.. గూగుల్ పే వంటివి మద్యం దుకాణాల్లో ఎందుకు కనిపించవని ప్రశ్నించారు పురందేశ్వరి. ఏపీ ఆన్‌లైన్ అనే యాప్ ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు చేస్తామంటూ ప్రకటించారు కానీ.. అది పని చేయడం లేదని చెబుతున్నారన్నారు. మద్యం అవకతవకలపై విచారణ చేయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరామని.. అలాగే ఏపీ ఆర్థిక స్థితిగతులపై నిర్మలా సీతారామన్ ను ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.
రూ. వేల కోట్లు దారి మళ్లుతున్నాయన్న ఏపీ బీజేపీ ఆరోపణలు
రాష్ట్రంలోని మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. లిక్కర్ బాండ్ల ద్వారా రాష్ట్రప్రభుత్వం రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చింది. మద్యం తయారీ కంపెనీల నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.300-400 కోట్ల ముడుపులు అందుతున్నాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక… 2024 నాటికి మద్యం విక్రయాలను ఐదు నక్షత్రాల హోటళ్లకే పరిమితం చేసి, ఆ తర్వాతే ఓట్ల కోసం మీ వద్దకు వస్తానని జగన్ చెప్పారని కానీ ఇప్పుడు మాట మార్చారన్నారు. మద్యం తయారీ కంపెనీల యజమానులను బెదిరించి, అధికారపార్టీ ముఖ్యనేతలు వాటిని చేజిక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు.