కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం  సంక్షిప్తంగా సీపీఎస్. ఈ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలని ఏపీ ఉద్యోగులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల ఉద్యమాలకు మద్దతు తెలిపి వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ రెండున్నరేళ్లు దాటిపోయింది. మళ్లీ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారు కానీ సీపీఎస్ రద్దు కాలేదు. ప్రభుత్వం ఎన్నో కారణాలు చెబుతోంది. కానీ అనూహ్యంగా సీపీఎస్‌ను రాజస్తాన్ ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆ కారణాలన్నీ .. "కారణాల" కోసమేనా అన్న అనుమానం ఉద్యోగుల్లో ప్రారంభమయింది. 


సీపీఎస్ రద్దు చేసిన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం !


రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బడ్జెట్ లో ఉద్యోగులకు వరాలు ప్రకటించారు. అందులో సీపీఎస్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. 2004 తర్వాత చేరిన వారెవరికీ సీపీఎస్ ఉండదని పాత పెన్షన్ విధానమే ఉంటుందని  ప్రకటించారు. నిజానికి రాజస్తాన్ ఉద్యోగుల్లో సీపీఎస్ వద్దని పాత పెన్షన్ విధానం కావాలని ఉంది కానీ వారు ఉద్యమాలు  చేయలేదు. వారి ఓట్ల కోసం రాజకీయ పార్టీలు సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పలేదు. ఎన్నికల్లో హామీగా పెట్టి గెలిచిన తర్వాత చేద్దామని సీఎం గెహ్లాట్ అనుకోలేదు. ఉద్యోగుల మనోభావాలను గుర్తించి రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. 



సీపీఎస్ రద్దు సాధ్యం కాదన్నట్లుగా ఇటీవల సజ్జల ప్రకటన !



ఏపీ ప్రభుత్వం తరపున ఉద్యోగుల అంశాల్లో చర్చలు జరిపిన సజ్జల రామకృష్ణారెడ్డి ఓ సందర్భంగా  కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయలేమని మీడియాతో వ్యాఖ్యానించారు. టెక్నికల్ ఇష్యూస్ తెలియక సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన ఉద్యోగసంఘాలతో భేటీ తర్వాత మీడియాతో వ్యాఖ్యానించారు. సీపీఎస్ రద్దు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని లెక్కలు చెబుతున్నాయన్నారు. సీపీఎస్‌ రద్దు చేయడం అసాధ్యం కాబట్టి...  వారికి పెన్షన్ సెక్యూరిటీ ఎలా అని ఆలోచిస్తున్నామన్నారు.ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే సలహాదారు ప్రకటన ఫైనల్ కాదు కాబట్టి ప్రభుత్వంతోనే తేల్చుకుంటామని ఉద్యోగసంఘాలు చెబుతున్నాయి. 


మార్చి 31లోపు రోడ్ మ్యాప్ ఇస్తామన్న ఏపీ ప్రభుత్వం !


ఇటీవల  పీఆర్సీ కోసం ఉద్యోగులు రోడ్డెక్కినప్పుడు జరిపిన చర్చల్లో ప్రభుత్వం సీపీఎస్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. సీఎం జగన్‌ మార్చి 31లోగా సీపీఎస్‌ రద్దుపై ‘రోడ్‌ మ్యాప్‌’ సిద్ధం చేస్తామని ప్రకటించారు. రద్దు చేస్తామని చెప్పలేదు.. రద్దు చేయడానికో లేకపోతే మరో ప్లాన్‌ అమలు చేయడానికో రోడ్ మ్యాప్ ప్రకటిస్తామన్నారు. ఇక్కడే సీపీఎస్ ఉద్యోగులకు అనుమానాలు ప్రారంభమయ్యాయి. సీపీఎస్ రద్దు చేస్తారా లేకపోతే ఇంకేదైనా ప్రత్యామ్నాయం ప్రకటిస్తారా అన్నది వారికి అర్థం కావడం లేదు. సీపీఎస్ రద్దు మినహా మరేమీ అక్కర్లేదని ఉద్యోగులంటున్నారు. 


సీపీఎస్ రద్దు అంత తేలిక కాదు !



సీపీఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను 2003 చివర్లో అప్పటి వాజ్‌పేయ్ ప్రభుత్వం ఈ పధకానికి  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్కీమ్ ను 2004లో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం అమలు చేసింది.   సీపీఎస్ ప్రకారం 2004, జనవరి 1 తర్వాత  ప్రభుత్వ ఉద్యోగంలో చేరే వారందరూ సీపీఎస్‌ కిందికి వస్తారు. పెన్షన్ కోసం ప్రతీనెల ఉద్యోగి జీతం నుంచి 10శాతం కట్ చేస్తారు. ప్రభుత్వం మరో 10శాతం నిధులు ప్రభుత్వం ఇస్తుంది. ఈ పెన్షన్‌ నిధిని నేషనల్‌ పెన్షన్‌ స్కీం ట్రస్టు, నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌ ద్వారా షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడతారు. పదవీ విరమణ సమయంలో సర్వీసు మొత్తంలో ఉద్యోగి, ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీత శాతంలో యాన్యుటీ ప్లాన్‌లలో ఉంచి నెలవారీ పెన్షన్ చెల్లిస్తారు.  స్టాక్ మార్కెట్ పెరిగితే పెన్షన్ పెరుగుతుంది. సెన్సెక్స్ కుప్పకూలితే పెన్షన్ కూడా కరిగిపోతుంది.  ఉద్యోగి చనిపోతే షేర్‌ మార్కెట్లో ఉన్న సొమ్ము మొత్తం ఆ కుటుంబానికి చెల్లిస్తారు. తరువాత ఆ ఎలాంటి పెన్షన్ ఉండదు.  



అధికారం ప్రభుత్వం చేతుల్లోనే ఉంది !



చంద్రబాబు  ప్రభుత్వం  సీపీఎస్ రద్దు మార్గాలను అన్వేషించడానికి టక్కర్ కమిటీని నియమించింది. ఆ కమిటీ 2019 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నివేదికలో.. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కమిటీ నిర్ధారించింది.  ప్రభుత్వానికి 141 పేజీల నివేదికను సమర్పించింది. కమిటీలో సమస్య పరిష్కారానికి రెండు ఆప్షన్లను సూచించింది. ఒకటి సీపీఎస్ రద్దు చేయడం లేదా సీపీఎస్ ను కొనసాగించి పాత పెన్షన్ విధానం వల్ల వచ్చే ప్రయోజనాలన్నింటినీ కల్పించడం... ఆప్షన్లుగా ఇచ్చింది. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  


భారం ఎక్కువనే ఆలోచిస్తున్న ప్రభుత్వం !



నిజానికి సీపీఎస్ స్కీమ్‌నురద్దు చేయడం  రాష్ట్ర ప్రభుత్వానికి క్షణంలో పని. అందుకే రాజస్థాన్ చేసేసింది. కానీ ఆ కారణంగా పడే భారం మాత్రం భరించలేనంత ఉంటుంది. సీపీఎస్ స్కీమ్‌లో చేరేందుకు పీఎఫ్ఆర్‌డీఏ చట్టంతోపాటు ఈ చట్టం అమలుకు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ స్కీమ్ నుండి వైదొలిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంటే కేంద్రానికి లేఖ రాస్తే ఆ దిశగా చర్యలు తీసుకొనే అవకాశాలు ఉంటాయి. కానీ దీని వల్ల పడే ఆర్థిక భారమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరం అయింది. రాజస్థాన్ ఈ భారాన్ని భరిస్తోంది. కానీ ఏపీ మాత్రం అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందుకే ప్రభుత్వం ఆలోచిస్తోంది. 


మార్చి నెలాఖరు కల్లా రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. అందుకే మార్చి నెలాఖరు వరకూ  ఉద్యోగులు ఎదురు చూసే అవకాశం ఉంది. అప్పుడు ప్రభుత్వం సీపీఎస్ రద్దు సాధ్యం కాదని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే రాజస్తాన్ రద్దు చేసి చూపించింది మరి...!