Minister Adimulapu Suresh : ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటనపై మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విమర్శలు చేశారు. దళితులను అవహేళన చేసిన చంద్రబాబు, లోకేశ్ లకు... దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా? అని విమర్శించారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? దళితులు ఏమి పీకలేరు. అని మీరు అనలేదా? అని మండిపడ్డారు. యర్రగొండపాలెం టీడీపీ ఇన్ ఛార్జ్ ఏరిక్షన్ బాబును కూడా నెల్లూరు మీటింగ్ లో చంద్రబాబు అవమానించారన్నారు. ఏ చెట్టూ లేని చోట ఆముదపు వృక్షం లాంటి ఏరిక్షన్ బాబే అక్కడ మహా వృక్షం అని అనలేదా? అని గుర్తుచేశారు. అలాంటి పార్టీలో ఈ దళిత నాయకులు ఎలా కొనసాగుతారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో కొత్త జిల్లాల విషయం గుర్తుకురాలేదన్నారు. ఇప్పుడు మార్కాపురం జిల్లా చేస్తానంటే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. జగనన్న కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటంతో పాటు ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు కూడా పెట్టారన్నారు. ఇన్నాళ్లు గుర్తుకు రానీ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే చంద్రబాబుకు గుర్తుకు వస్తుందేమిటి? అన్నారు. చంద్రబాబు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కనబడితే ఒప్పుకోరు కానీ సభల్లో మాత్రం జై ఎన్టీఆర్ అని అంటారని ఎద్దేవా చేశారు. రెండు నాలుకల ధోరణి చంద్రబాబుకే సాధ్యం అని సెటైర్లు వేశారు. 


మంత్రి సీదిరి సెల్ఫీ ఛాలెంజ్ 


మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.  ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి భవనాన్ని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి   సీదిరి అప్పలరాజు... తన ముఖానికి సీఎం జగన్ ఫొటో ఉన్న మాస్క్‌ పెట్టుకుని టీడీపీకి సెల్ఫీ ఛాలెంజ్ సవాల్ విసిరారు. శ్రీకాకుళంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గత 14 ఏళ్లలో ఒక్క పోర్టుకు గానీ, హార్బర్‌కు గానీ చంద్రబాబు శంకుస్థాపన చేశారని చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పోయేకాలం వచ్చిందని మండిపడ్డారు. అందుకే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి టెక్కలి నుంచి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీను ఎమ్మెల్యేగా గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు.  


కళ్లు కనిపించడంలేదా? 


ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి దమ్ముంటే చర్చకు రావాలని మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి చెప్పిన రూపాయి ఖర్చుతో సహా చెప్పగలనన్నారు. సీఎం జగన్ చేపట్టిన ప్రాజెక్టులు మీ ముందు లేవా? మీకు కళ్లు కనిపించడంలేదా? అని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు టీడీపీ ప్రభుత్వం ఇది చేశామని అచ్చెన్నాయుడు చెప్పగలరా? అని మంత్రి సీదిరి ప్రశ్నించారు. సుదీర్ఘమైన తీరప్రాంతం ఉన్న రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు... రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. అసలు తీర ప్రాంతానికి చంద్రబాబు చేసిందేంలేదని, గుండు సున్నా తప్ప అని విమర్శించారు.  సీఎం జగన్‌ను విమర్శించే ముందు అచ్చెన్నాయుడు ఆలోచించి మాట్లాడాలంటూ మంత్రి సీదరి అప్పలరాజు హితవు పలికారు.