Flash Light Over Kyiv Sky:
కీవ్‌లో ఘటన..
రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాదిన్నర దాటుతోంది. మొదలైనప్పుడు ఏ టెన్షన్ ఉందో...ఇప్పటికే అదే కొనసాగుతోంది. రెండు దేశాలూ వెనక్కి తగ్గడం లేదు. అగ్రరాజ్యం సహా పలు దేశాలు ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అవేవీ వర్కౌట్ కావడం లేదు. ఉక్రెయిన్‌పై మిజైల్స్ దాడులు ఆపడం లేదు రష్యా. ఉక్రెయిన్‌లోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ధ్వంసమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటున్నారు అక్కడి ప్రజలు. ఈ ఉద్రిక్తతల మధ్య కీవ్‌లో ఉన్నట్టుండి ఆకాశంలో మెరుపు లాంటి కాంతి కనిపించడం కలకలం రేపింది. మళ్లీ రష్యా మిజైల్స్‌తో దాడి చేస్తోందా అని ఆందోళన చెందారు. కానీ అది మిజైల్ దాడి కాదని అధికారులు స్పష్టం చేశారు. మరి ఇదేమై ఉంటుందని ఆరా తీసింది ఉక్రెయిన్ స్పేస్ ఏజెన్సీ. అంతరిక్షం నుంచి ఉల్క పడి ఉండొచ్చని అంచనా వేసింది. ముందుగా..నాసాకు చెందిన ఉపగ్రహం భూమికి తిరిగొచ్చే క్రమంలో ఇలాంటి వెలుగు కనిపించి ఉండొచ్చని భావించినా...నాసా దీన్ని ఖండించింది. ఇంకా ఆ శాటిలైట్ కక్ష్యలోనే ఉందని వెల్లడించింది. 660 పౌండ్ల బరువున్న ఓ రిటైర్డ్ ఉపగ్రహం భూ కక్ష్యలోకి చేరుకునే అవకాశముందని ఇటీవలే నాసా ప్రకటించింది. అయితే...ఈ వెలుగు ఎందువల్ల వచ్చిందన్న క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు.
"నిజానికి ఆ ఆబ్జెక్ట్ ఏమిటి అన్నది మేం ఎటూ తేల్చుకోలేకపోతున్నాం. అది ఉల్క అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ఇప్పటికైతే మా వద్ద సరైన డేటా లేదు. ఎందుకు అంత ఫ్లాష్ వచ్చిందన్నది విచారిస్తున్నాం. రష్యన్ మిజైల్ కారణంగానే ఈ లైటింగ్ వచ్చిందా అన్నది స్పష్టత లేదు. నిపుణులు ఇదేంటన్నది పరిశీలిస్తున్నారు"
- ఉక్రెయిన్ స్పేస్ ఏజెన్సీ
సోషల్ మీడియాలో పోస్ట్‌లు
రాత్రి 10 గంటలకు ఉన్నట్టుండి ఆకాశంలో మెరుపు లాంటి కాంతి కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. క్షణాల్లోనే ఇది వైరల్ అయింది. కొంత మంది ఇది ఫ్లైయింగ్ సాసర్ అయ్యుంటుందని పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ సింబల్స్‌తో కొందరు వీడియోలు పోస్ట్ చేస్తూ వదంతులు వ్యాప్తి చేస్తున్నారంటూ ఉక్రెయిన్ రక్షణ శాఖ అసహనం వ్యక్తం చేసింది. ఎయిర్ ఫోర్స్ సింబల్ వినియోగించొద్దని తేల్చి చెప్పింది. అయినా ట్విటర్‌లో మీమ్స్ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు వెలుగులోకి వచ్చేంత వరకూ ఈ మీమ్స్ ఆగేలా లేవు.