Minister Seediri Selfie Challenge : మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.  ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి భవనాన్ని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి   సీదిరి అప్పలరాజు... తన ముఖానికి సీఎం జగన్ ఫొటో ఉన్న మాస్క్‌ పెట్టుకుని టీడీపీకి సెల్ఫీ ఛాలెంజ్ సవాల్ విసిరారు. శ్రీకాకుళంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గత 14 ఏళ్లలో ఒక్క పోర్టుకు గానీ, హార్బర్‌కు గానీ చంద్రబాబు శంకుస్థాపన చేశారని చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పోయేకాలం వచ్చిందని మండిపడ్డారు. అందుకే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి టెక్కలి నుంచి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీను ఎమ్మెల్యేగా గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు.  


కళ్లు కనిపించడంలేదా? 


ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి దమ్ముంటే చర్చకు రావాలని మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి చెప్పిన రూపాయి ఖర్చుతో సహా చెప్పగలనన్నారు. సీఎం జగన్ చేపట్టిన ప్రాజెక్టులు మీ ముందు లేవా? మీకు కళ్లు కనిపించడంలేదా? అని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు టీడీపీ ప్రభుత్వం ఇది చేశామని అచ్చెన్నాయుడు చెప్పగలరా? అని మంత్రి సీదిరి ప్రశ్నించారు. సుదీర్ఘమైన తీరప్రాంతం ఉన్న రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు... రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. అసలు తీర ప్రాంతానికి చంద్రబాబు చేసిందేంలేదని, గుండు సున్నా తప్ప అని విమర్శించారు.  సీఎం జగన్‌ను విమర్శించే ముందు అచ్చెన్నాయుడు ఆలోచించి మాట్లాడాలంటూ మంత్రి సీదరి అప్పలరాజు హితవు పలికారు. 



నా వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా? 


ఉత్తరాంధ్రలో పోర్టులు, హార్బర్‌ కేంద్రంగా వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేసిన తర్వాత..అచ్చెన్నాయుడుకు ఏం చేయాలో అర్థం కావట్లేదని సెటైర్ వేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో.. ఒక్క పోర్టు గానీ, ఒక్క హార్బర్‌కు గానీ శంకుస్థాపన చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు సీదిరి. వైసీపీ పాలనలో 10 హార్బర్లకు శంకుస్థాపనలు జరిగాయని.. పోర్టుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 


వలసలు అడ్డుకునే ప్రయత్నం


"సీఎం జగన్ చేతుల మీదుగా మూలపేట పోర్టుకు శంకుస్థాపన జరిగింది. నిన్న కార్యక్రమం జిల్లా అభివృద్ధికి చాలా కీలకం. మూలపేట పోర్టు వల్ల కొన్న వేల మందికి ఉపాధి దొరుకుతుంది. 4 నుంచి 6 వేల ల్యాండ్ బ్యాంక్ తయారు చేసి జిల్లాను పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. పోర్టు అంటే పెట్టుబడులు, ఎగుమతులు, దిగుమతులు. ఈ జిల్లాలోని మత్య్సకారుల కోసం రెండు హార్బర్లు నిర్మిస్తున్నాం. వలసలను అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. భావనపాడు వద్ద ఉన్న హార్బర్ ను కూడా పోర్టు పనులతో సహా అభివృద్ధి చేస్తాం. మూలపేట పోర్టుకు శంకుస్థాపన జరిగిందని తెలియగానే అచ్చెన్నాయుడు నిన్నటి నుంచి గిలగిలకొట్టుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తు్న్నారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పరిపాలనలో ఎక్కడైనా పోర్టుకు గానీ, హార్బర్ కు గానీ శంకుస్థాపన జరిగినట్లు చూపిస్తే రాజకీయాలు విడిచిపెట్టేస్తా. కృష్ణపట్నం పోర్టుకు వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు. మచిలీపట్నం, గంగవరం, కాకినాడ, ఎస్ఈజెడ్ పోర్టు , రామయపట్నం పోర్టు వైఎస్ఆర్ టైంలోనే స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రంలో రెండు హార్బర్లు మాత్రమే ఉన్నాయి. వైజాగ్, కాకినాడ. వైజాగ్ కు రూ.150 కోట్లు ఇచ్చాం. చంద్రబాబు హయాంలో అచ్చెన్నాయుడు ఒక్క రూపాయి ఇచ్చారా?"- మంత్రి సీదిరి అప్పలరాజు