Pawan Kalyan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలువురు రైతు కుటుంబాలను పరామర్శించారు. ఏటుకూరు కూడలి, లూలుపురం కూడళ్ల మీదగా ఈ యాత్ర సాగింది. పవన్‌ కల్యాణ్ యాత్రలో పెద్ద సంఖ్యలో జనసైనికులు, అభిమానులు పాల్గొన్నారు. చిమటావారిపాలెం డేగలమూడిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ.లక్ష  సాయం అందించారు. అనంతరం యద్దనపూడి మండలం యనమదలలో రైతు భరోసా యాత్రను కొనసాగించారు. పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్‌ పాల్గొనున్నారు. భారీవర్షం కారణంగా ఎస్‌కేపీఆర్‌ ప్రాంగణంలోని సభాస్థలి తడిసిపోయింది. 


ఆడ బిడ్డల చదువుల బాధ్యత నాది 


సాగు భారమై, వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు పోలవరపు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పవన్ కల్యాణ్ ఆదివారం ఉదయం పరామర్శించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం యనమదల గ్రామానికి వెళ్లిన ఆయన ఆ కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఆయన భార్య పోలవరపు అనూషకు అందజేశారు. ఇద్దరు ఆడబిడ్డలు వైష్ణవి, శ్రీలక్ష్మీ చదువుల బాధ్యత జనసేన చూసుకుంటుందని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా  పవన్ కల్యాణ్... వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వరుసగా పంట నష్టాలు రావడం, బోర్లు వేసిన నీళ్లు పడకపోవడం, సాగు కోసం చేసిన రూ.16 లక్షలు అప్పు తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.






ఘన స్వాగతం 


అనంతరం డేగర్లమూడిలో కౌలు రైతు నీలం రవికుమార్ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు పవన్ కల్యాణ్.  ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం, యువత, ఆడపడుచుల అభ్యున్నతి కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అంకితమన్నారు. కంతేరు ప్రాంతంలోనూ జనసేన నాయకులూ, కార్యకర్తలు పవన్ కు ఘన స్వాగతం పలికారు.