Prakasam District: ప్రకాశం జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన ఓ వ్యక్తిని ఊళ్లో, శ్మశానంలో స్థలం లేదని ఆరోపిస్తూ ఓ కుటుంబం ఏకంగా ఇంట్లోనే చితి పేర్చింది. ఈ విషాదకర ఘటన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడులో చోటు చేసుకుంది. పులిపాడులోని ఓ బ్రాహ్మణ కుటుంబం విషయంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా అదే గ్రామంలో నివసించే ఓ బ్రాహ్మణ కుటుంబంలో ఓ మహిళ అనారోగ్యంతో గురువారం సాయంత్రం చనిపోయింది. అయితే, ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించడానికి ఆ గ్రామానికి చెందిన శ్మశాన వాటికలో ఖాళీ లేదని కుటుంబ సభ్యులు భావించారు.
దీంతో ఇంట్లోనే చితి పేర్చి అంత్యక్రియలు చేసేయాలని కుటుంబ సభ్యులు అందరూ నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే కట్టెలు తెచ్చి శవాన్ని ఉంచి చితి కూడా పేర్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఊళ్లో ప్రజలు ఆపేందుకు యత్నించారు. అయినా వారు వినకపోవడంతో ప్రజలు వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అయితే, నిన్న సీఎం జగన్ పర్యటన ఒంగోలులో ఉండడంతో జిల్లా సిబ్బంది మొత్తం ఆ కార్యక్రమంలో నిమగ్నమైపోయారు.
గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఫోన్ ద్వారా స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు జోక్యం చేసుకొని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగేలా ఏర్పాట్లు చేయించారు.
ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ.. పులిపాడులో ఉన్న హిందూ శ్మశానవాటిక ఆక్రమణలకు గురైందని ఆవేదన చెందారు. ముఖ్యంగా తమ లాంటి బ్రాహ్మణ కులస్థులు చనిపోతే అంత్యక్రియలు జరిపేందుకు ఎలాంటి చోటు లేకుండా పోయిందని ఆయన వాపోయారు. ఈ విషయం గురించి అనేక సార్లు తాము అధికారులకు విన్నవించుకున్నామని చనిపోయిన మహిళ భర్త సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదని చెప్పారు. శ్మశానంలో ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్ నుంచి నోటీసులు అందినా కూడా స్థానిక అధికారులు శ్మశానం విషయంలో ఏమీ స్పందించడం లేదని చెప్పుకొచ్చారు.
Also Read: Palnadu District: అందరూ చూస్తుండగా పట్టపగలే కిడ్నాప్, మరుసటిరోజు ఉదయం శవమై కనిపించిన ఎగ్జిక్యూటివ్ !
Also Read: Hyderabad: గుడిలో పూజారి పాడు పని! అక్షింతలు వేస్తానని ఇనుప రాడ్‌తో చంపేసి - ఈ సంచలన విషయాలు
Also Read: Guntur News : వృద్ధురాలి భూమి కొట్టేసిన అధికార పార్టీ నేతలు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న బామ్మ!