Palnadu Murder Case In Narasaraopet:  పల్నాడు జిల్లా నరసరావుపేటలో‌ కిడ్నాపైన వ్యక్తి కథ విషాదంగా ముగిసింది. నిన్న పట్టపగలే కొందరు వ్యక్తులు జ్యువెలరీ షాపు నుంచి ఎగ్జిక్యూటివ్‌ రామాంజనేయులును శుక్రవారం కిడ్నాప్ చేశారు. కొట్టుకుంటూ ఆటోలో తీసుకు వెళుతున దృశ్యాలు సైతం సీసీ‌ కెమెరాలలో  రికార్డు అయ్యాయి. భర్తను కొందరు కిడ్నాప్ చేశారని రామాంజనేయులు భార్య పోలీసులను ఆశ్రయించింది. కానీ నిన్న కిడ్నాప్ అయిన రామాంజనేయులు నేడు మృతదేహం (Kalyan Jewellers Employee Murder)గా కనిపించాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


పట్టపగలే కిడ్నాప్.. 
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాంజనేయులు నరసరావుపేటలోని కళ్యాణ్ జ్యువెలరీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. రామాంజనేయులు భార్య ప్రస్న లక్ష్మీ ఏపీఎస్ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది.ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మధ్యాహ్నం వేళ జ్యువెలరీ షాపులో అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యానికి దిగారు. షాపులో ఉన్న ఎగ్జిక్యూటివ్ రామాంజనేయులును బటయకు లాక్కొచ్చి దాడి చేశారు. అంతటితో ఆగకుండా నిందితులు అతడ్ని చితకబాదుతూ కిడ్నాప్ చేసి, ఆటోలో తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ‌ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. 


పోలీసులను ఆశ్రయించిన బాధితుడి భార్య.. 
తన భర్తను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని, వారి చెరనుంచి రామాంజనేయులును విడిపించాలని అతడి భార్య పోలీసులను ఆశ్రయించించింది. జంగం బాజీ, అన్నవరపు కిషోర్ అనే వ్యక్తితో తన భర్త తిరుగుతాడని.. కిడ్నాప్ విషయంలో అతడిపైనే అనుమానం ఉందని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు వీడియోలో కనిపించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పత్తిపాడు మండలం  తుమ్మలపాలెం వద్ద మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.



అక్కడికి చేరుకొని పరిశీలించిన పోలీసులు.. ఆ మృతదేహం నిన్న కిడ్నాప్ అయిన రామాంజనేయులు అని గుర్తించారు. రామాంజనేయులు మృతదేహం విషయాన్ని పత్తిపాడు పోలీసులు నరసరావుపేట పోలీసులకు తెలిపారు. పోలీసులు నుంచి సమాచారం అందుకున్న మృతుడి కుటుంబసభ్యులు తుమ్మలపాలెం బయలుదేరారు. కిడ్నాప్ అయిన కొన్ని గంటల్లోనే హత్య జరగడంతో వారు ఇంకా షాక్‌లో ఉన్నారు. హత్య చేస్తారని ఊహించలేకపోయామని బాధిత కుటుంబం వాపోయింది. రామాంజనేయులు కిడ్నాప్ అయిన తరువాత ఏం జరిగింది, హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 


Also Read: Hyderabad: గుడిలో పూజారి పాడు పని! అక్షింతలు వేస్తానని ఇనుప రాడ్‌తో చంపేసి - ఈ సంచలన విషయాలు


Also Read: Guntur News : వృద్ధురాలి భూమి కొట్టేసిన అధికార పార్టీ నేతలు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న బామ్మ!