సాధారణంగా విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణిస్తుంటారు. చిన్నారుల ఆసక్తిని గుర్తించి వారికి సరైన ప్రోత్సహం అందిస్తే.. కన్నవారికే కాకుండా దేశానికే పేరు తెచ్చే విధంగా సత్తా చాటుతారు. చేసే పని ఏదైనా పట్టుదలతో సాధించాలి అనే కసితో ప్రయత్నిస్తే.. కొండలనైనా పిండి చేయచ్చు అని ఎందరో మహానుభావులు నిరూపించారు. అయితే తొమ్మిదేళ్ళ బాలుడు ప్రపంచంలో ఎవరూ చేయని సాహసం చేసి కన్నవారికి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టడమే కాకుండా అసాధ్యం అన్న మాటకు అర్థం లేకుండా చేశాడు. ఆ బాలుడు చేసిన సాహసానికి వజ్ర వరల్డ్ రికార్డు, గ్లోబల్ వరల్డ్ రికార్డు, చిల్డ్రన్ బుక్ ఆఫ్ రికార్డు వరించింది. చిత్తూరు జిల్లా, పుత్తూరుకు చేందిన కృష్ణకుమార్(కుట్టి), లీలావతి దంపతుల తొమ్మిదేళ్ళ కుమారుడు 165 కిలో మీటర్లు కంటికి గంతలు కట్టుకుని ఎవరూ చేయని సాహసం చేసి సోలో స్కెటింగ్ తో రికార్డు బద్దలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.


వివరాల్లోకి వెళ్ళితే.. చిత్తూరు జిల్లా, పుత్తూరులోని భవాని కాలనీలో నివాసం ఉండే కృష్ణకుమార్(కుట్టి), లీలావతి దంపతుల ఏకైన కుమారుడే భరత్ రాజా.. కృష్ణకుమార్ చదువుకోక పోవడంతో రోజూ వారి‌ కూలీగా పెయింట్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.‌. తాను కష్ట పడితే వచ్చిన ఆదాయంతో ఒక్కగానొక్క కుమారుడిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్ లో చదివిస్తూ ఉన్నాడు.. అందరూ పిల్లలలాగా తన కుమారుడు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ ప్రోత్సహం అందించాలని నిర్ణయించుకుని పుత్తూరులోని టాలెంట్ స్కేటింగ్ స్కూల్ లో చేర్పించాడు. టాలెంట్ స్కేటింగ్ స్కూల్ తరపున అనేక మార్లు వివిధ ప్రాంతాల్లో పోటీలకు వెళ్ళినా భారత్ రాజా ఆటలో గెలవలేక పోయేవాడు. 


దీంతో నిరాశకు గురి కాకుండా టాలెంట్ స్కేటింగ్ స్కూల్ కోచ్ ప్రతాప్ మరింత బలాన్ని చేకూర్చే విధంగా బాలుడికి ఆటలో మెలకువలు నేర్పుతూ వచ్చేవాడు. దీంతో పోటీల్లో వరుసగా కప్ సాధించేవాడు. దీంతో బాలుడి ప్రతిభను గుర్తించి స్కేటింగ్ కోచ్ ప్రత్యేక దృష్టి సారించేవాడు.‌. తమ బాలుడికి స్కేటింగ్ లో రికార్డు సాధించేలా తీర్చి దిద్దుతానని కోచ్ హామీ ఇవ్వడంతో ఉదయం నాలుగు గంటలకే భరత్ రాజాని నిద్ర లేపి స్కెటింగ్ నేర్చుకునేందుకు పంపేవారు.. అటు తరువాత ఇంటికి రాగానే స్కూల్ కి పంపేవారు. మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే ఏ మాత్రం విశ్రాంతి లేకుండానే స్కెటింగ్ స్కూల్ కి తీసుకెళ్ళేవారు. 


అయితే, అధిక సమయం స్కేటింగ్ పై దృష్టి సారించడంతో భరత్ రాజా స్కెటింగ్ పై మంచి పట్టు సాధించాడు. తోటి విద్యార్థిని, విద్యార్థుల కంటే భరత్ రాజా ముందుండాన్ని గమనించిన స్కేటింగ్ కోచ్ ప్రతాప్ ఎలాగైనా ఎవరూ చేయని సాహసం భరత్ రాజాతో చేయించి, రికార్డును బద్దలు కొట్టేలా ట్రైనింగ్ ఇచ్చాడు. ఇలా రోజూ 8 గంటల పాటు ట్రైనింగ్ ఇచ్చేవాడు. అంతేకాకుండా కంటికి గంతలు కట్టుకుని స్కేటింగ్ చేయడాన్ని దాదాపు 6 నెలలుగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఇందులో బాగా నైపుణ్యం సాధించడంతో వజ్రా వరల్డ్ రికార్డు, చిల్డ్రన్స్ బుక్ ఆఫ్ రికార్డు, గ్లోబల్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ ప్రతినిధులకు తెలియజేశారు. 


దీంతో ముందుగా బాలుడి విన్యాసాన్ని వీడియో రూపంలో వీక్షించిన ఆ సంస్ధ ప్రతినిధులు ఇవాళ ఉదయం కర్ణాటక రాష్ట్రం నంగిలి చెక్ పోస్టు నుండి బాలుడికి గంతలు కట్టి స్కేటింగ్ ప్రారంభించారు. ఉదయం 6:25 గంటలకు ప్రారంభంమైన ఈ స్కేటింగ్ నిరంతరాయంగా కొనసాగుతూ రాత్రి 10:20 నిమిషాలకు నగిరికి చేరుకున్నారు. నంగలి నుండి బాలుడు రోడ్డుపై స్కేటింగ్ చేస్తున్న సమయంలో స్థానిక పోలీసులు ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ సహాయ సహకారాలు అందించారు. అంతేకాకుండా 9 ఏళ్ల బాలుడు చేసే సాహసానికి గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నగిరిలోని మంత్రి ఆర్.కే.రోజా నివాసానికి చేరుకున్న బాలుడి సాహసాన్ని చూసి ఆశ్చర్య పోయి రూ.లక్ష బాలుడికి బహుమానంగా అందజేశారు. వజ్రా వరల్డ్ రికార్డు, గ్లోబల్ బుక్ ఆఫ్ రికార్డు, చిల్డ్రన్స్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి స్వయంగా బాలికకు వజ్రా రికార్డును నగిరిలో అందజేయనున్నారు.


ఈ‌ సందర్భంగా భరత్ రాజా తల్లిదండ్రులు ఏబీపీ దేశం ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు. తన కుమారుడు భరత్ రాజా తన కళను నెరవేర్చినందుకు తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆరు నెలలుగా భరత్ రాజా కంటికి గంతలు కట్టుకుని స్కేటింగ్ ట్రైనింగ్ తీసుకునే సమయంలో ఎంత బాధలు ఎదురైనా ఎంత కష్టం వచ్చినా వెనుతిరిగి చూడకుండా రోజూ స్కేటింగ్ క్లాస్ కు వెళ్ళే వాడని చెప్పారు. రోజు వారి కూలీ పనులు చేసుకుంటూ జీవించే తమ కుమారుడు ఇంతటి సాహసం చేస్తాడని కలలో కూడా అనుకోలేదని, ఒకేసారి వజ్రా వరల్డ్ రికార్డ్, చిల్డ్రన్స్ బుక్ ఆఫ్ రికార్డు, గ్లోబల్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని అన్నారు.