YS Sunitha :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని పోరాడుతున్న వైఎస్ సునీత తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారని ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి.  తెలుగుదేశం పార్టీలోకి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని స్వాగతం పలుకుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, అచ్చెన్నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, బీటెక్ రవిల ఫోటోలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకెళితే…. ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత పోస్టర్లు కలకలం సృష్టించాయి. వైఎస్ సునీత రాజకీయ రంగప్రవేశం చేస్తుందంటూ రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రొద్దుటూరు పట్టణమంతా పోస్టర్లు అతికించారు.                


వైఎస్ సునీత తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు వాల్ పోస్టర్లలో వైఎస్ వివేకానంద రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు మరికొంత మంది టీడీపీ ముఖ్య నేతల ఫోటోలు కూడా ఉన్నాయి. తెల్లవారే సరికి పట్టణమంతా వాల్ పోస్టర్లు చూసిన ప్రజలు దీనిపై పెద్ద ఎత్తున చర్చ పెట్టారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లు అయిన ఎర్ర మునిరెడ్డి కాలనీ, హోమస్ పేట, మున్సిపల్ పార్కు, వివేకానంద క్లాత్ మార్కెట్ కూడళ్లలో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే సంప్రదాయంగా టీడీపీ నేతలు వేసే పోస్టర్ల తరహాలో ఇవి లేవు. పైగా తెలుగుదేశం పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటివి వైసీపీ నేతలే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.                          


వైఎస్ సునీత రాజకీయంగా పోటీలోకి వస్తారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.  ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఆమె టీడీపీలో చేరుతారని..టీడీపీ అధ్యక్షుడ్ని కలిశారని ఆరోపించారు. అయితే రాజకీయంగా ఇంత వరకూ సునీత ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఆమె రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లుగా ప్రకటించలేదు. ప్రముఖ వైద్యురాలు అయిన ఆమె.. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు.  ఓ వైపు వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతూనే మరో వైపు .. విధులకూ హాజరవుతున్నారు. రాజకీయంగా ఎవరు వచ్చినా ఆమె కలిసేందుకు ఆసక్తి చూపరని అంటున్నారు. 


మరి  ఎవరు సునీత తెలుగుదేశం పార్టీలో చేరుతారని పోస్టర్లు వేశారన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. టీడీపీ నేతలు పోస్టర్లు వేస్తే.. వారు ఆ విషయాన్ని చెప్పుకుంటారు.. కానీ ఎవరుపోస్టర్లు వేశారో ఎవరికీ తెలియదు. అదీ కాకుండా అసలు ఒక్క ప్రొద్దుటూరులోనే ఎందుకు పోస్టర్లు వేశారనేది కీలకంగా మారింది. ఇది  వైసీపీ నేతల పనేనని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా అనుమానిస్తున్నారు. ఆమెపై టీడీపీ ముద్ర వేస్తే.. విషయం రాజకీయం అవుతుందని అందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు.