తాడిపత్రి మున్సిపాలిటీలో జరుగుతన్న అక్రమాలపై పోరు సాగిస్తున్న ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రెండోరోజు నిరసన బాట పట్టారు. సోమవారం నుంచి కొనసాగుతున్న ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న తాడిపత్రి మున్సిపల్ అధికారులు అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిరసన చేపట్టారు. సోమవారం మహాత్మ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. 


ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టేందుకు యత్నించిన జేసీ వర్గీయులను పోలీసులు అడ్డుకోడం నిన్న ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే ఆయన మాత్రం కార్యాలయంలోనే ఉంటూ దీక్ష కొనసాగిస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిందేనంటున్నారు. 


రాత్రి తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలోనే బస చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఉదయం అక్కడే స్నానం చేశారు. ఆయనకు పలువురు తెలుగుదేశం పార్టీ లీడర్లు సపోర్ట్ చేశారు.  యాడికి, పెద్దపప్పూరు, మండలాలకు చెందిన టీడీపీ లీడర్లు వచ్చి సంఘీభావం తెలిపారు. 










మున్సిపాలిటీలో డీజీల్, టైర్ల చోరీకి మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి  డిమాండ్ చేశారు. అధికార పార్టీ చెప్పినట్టు వింటూ ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ తన వైఖరి మార్చుకోవాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.