Devotees Travelled In Ambulance In Vijayawada: విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పడరాని పాట్లు పడుతున్నారు. దసరా సందర్భంగా భక్తుల రద్దీ అధికం కావడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. వీవీఐపీ, వీఐపీ సహా సాధారణ క్యూలైన్లు సైతం కిక్కిరిసిపోయాయి. భక్తులను అదుపు చేయలేక పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆలయ పరిసరాల్లోకి వాహనాలను అనుమతించడం లేదు. కేవలం అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఓ అంబులెన్స్ ఆలయం దగ్గరకు వచ్చింది. అనుమానం వచ్చిన పోలీసులు 108 వాహనాన్ని ఘాట్ రోడ్డు ఎంట్రన్స్‌లో ఆపి తనిఖీ చేశారు. అందులో చాలామంది దుర్గమ్మ భక్తులను చూసి కంగుతిన్నారు.


జీతాల్లేవని..


ఈ విషయంపై అంబులెన్స్ సిబ్బందిని ప్రశ్నించగా.. తమకు 3 నెలల నుంచి జీతాలు రావడం లేదని వాపోయారు. అందుకే డబ్బుల కోసం ఇలా భక్తులను తరలించామని చెబుతున్నారు. భక్తులు డబ్బులు ఇస్తే.. వాటితో పండుగ ఖర్చులకు వస్తాయని ఇలా చేసినట్లు చెప్పారు. అటు, అమ్మవారి దర్శనం కోసం వర్షంలోనూ భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శనం కోసం నిరీక్షించలేక సహనం కోల్పోయి ఘాట్‌రోడ్‌లోని ముఖద్వారం గేట్లను తోసుకుంటూ పరుగులు తీశారు. పోలీసులు, మీడియాను సైతం నెట్టుకుంటూ చొచ్చుకొచ్చారు. వారిని నిలువరించలేక పోలీసులు చేతులెత్తేశారు.


రాజరాజేశ్వరి అలంకారంలో దుర్గమ్మ


అటు, దసరా సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు అభయమిచ్చారు. సాధారణ భక్తులతో పాటు భవానీ మాలధారులు సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చిన్నపిల్లలు, వృద్ధులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. కొండపైకి వచ్చేందుకు ఆంక్షలు విధించడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో సాహసంతో కొండపైకి చేరుకుంటున్నారు. కాగా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల చివరి రోజు అమ్మవారు హంస వాహనంపై కృష్ణా నదిలో విహరిస్తారు. అయితే, ఆనవాయితీగా జరిగే ఈ దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవానికి ఈసారి నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బ్రేక్ పడింది. సుమారు 40 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం పై నుంచి వస్తుండడంతో తెప్పోత్సవం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నదీ విహారానికి అనుమతి లేనందున్న ఉత్సవమూర్తులను దుర్గాఘాట్ వరకూ తీసుకెళ్లి హంస వాహనంపై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 


Also Read: Vijayawada News: రాజరాజేశ్వరి దేవిగా బెజవాడ దుర్గమ్మ - ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు