Devotees Rush In Vijayawada Temple: దసరా సందర్భంగా విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రి (Indrakeeladri) భక్తులతో కిటకిటలాడుతోంది. విజయదశమి సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు అమ్మవారిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వీఐపీ, వీవీఐపీ, సాధారణ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పోలీసులు ఎక్కడి వారిని అక్కడే నిలువరించారు. రద్దీని బట్టి దర్శనానికి అనుమతించారు. సాధారణ భక్తులతో పాటు భవానీ మాలధారులు సైతం వేలాదిగా తరలివచ్చారు. చిన్నపిల్లలు, వృద్ధులు సైతం అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. దుర్గమ్మ నామ స్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.


భక్తుల ప్రత్యామ్నాయ మార్గాలు


అటు, భక్తుల రద్దీతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసిపోగా.. అధికారులు, పోలీసుల ఆంక్షలతో కొన్నిచోట్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపైకి వచ్చేందుకు ఆంక్షలు విధించడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో సాహసంతో కొండపైకి చేరుకుంటున్నారు. కొందరు భక్తులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఎంతో ఆశతో వచ్చామని.. ఇలా ఆంక్షలు విధించడం సరికాదని అంటున్నారు.


తెప్పోత్సవానికి బ్రేక్


కాగా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల చివరి రోజు అమ్మవారు హంస వాహనంపై కృష్ణా నదిలో విహరిస్తారు. అయితే, ఆనవాయితీగా జరిగే ఈ దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవానికి ఈసారి నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బ్రేక్ పడింది. సుమారు 40 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం పై నుంచి వస్తుండడంతో తెప్పోత్సవం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నదీ విహారానికి అనుమతి లేనందున్న ఉత్సవమూర్తులను దుర్గాఘాట్ వరకూ తీసుకెళ్లి హంస వాహనంపై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఒకవేళ వర్షం వచ్చి ఆటంకాలు ఎదురైతే మహా మండపంలోని ఆరో అంతస్తులో పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు


మరోవైపు, తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో శ్యామలరావు తెలిపారు. స్వామి వారి వాహన సేవలను దాదాపు 15 లక్షల మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. శనివారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. 'భక్తులకు సేవ చేయడమంటే భగవంతునికి సేవ చేయడమే. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశాం. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి చర్యలు చేపట్టాం. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా బ్రహ్మోత్సవాలు నిర్వహించాం. 8 రోజుల్లో 6 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.26 కోట్ల ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాలు అందించాం. 2.6 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి ఆలయంలో 3.2 లక్షల మందికి నైవేద్యాన్ని ప్రసాదంగా అందించాం. 30 లక్షల లడ్డూలను విక్రయించాం.' అని ఈవో పేర్కొన్నారు.


వైభవంగా చక్రస్నానం


తిరుమలలో శనివారం ఉదయం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు అర్చకులు పుష్కరిణిలో క్రతువు నిర్వహించగా.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 


Also Read: Konaseema News: కబ్జా కోరల్లో ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్‌- రోడ్లున పడ్డ ప్రయాణికులు- చోద్యం చూస్తున్న అధికారులు!