Kuppam Babu Tour : రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ముందుగా ఈ ఎఫెక్ట్ టీడీపీ అధినేత చంద్రబాబు మీదనే కనిపిస్తోంది. కుప్పం నియోజవకర్గంలో మూడు రోజుల పాటు పర్యటించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. ప్రతీ సారి కుప్పం నియోజకవర్గంలో సంక్రాంతికి ముందు మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ సారి కూడా ఆయన పర్యటన ఖరారైంది. అయితే ఇప్పుడు రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఆయన పర్యటనపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు పర్యటన పూర్తి డీటైల్స్ ఇస్తే అనుమతి గురించి పరిశీలిస్తామన్న పలమనేరు డీఎస్పీ
కుప్పం టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటన వివరాలను పలమనేరు డీఎస్పీకి ఇచ్చారు. అయితే పలమనేరు డీఎస్పీ ఆ తర్వాత పర్యటన పూర్తి వివరాలను ఇస్తే అనుమతిపై పరిశీలిస్తామని తిరుగు సమాధానం పంపారు. అనుమతులు తీసుకోకుండా.. ర్యాలీలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు పెడతామని పలమనేరు డీఎస్పీ హెచ్చరించారు. దీనిపై టీడీపీ నేతలు ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. పోలీసులు అనుమతులతో సంబందం లేదని.. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా పార్టీ నేతలు ఘన స్వాగతం పలుకుతాయని ఇందులో ఎలాంటి మార్పు ఉండదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
కుప్పంలో చంద్రబాబు ఎప్పుడు పర్యటించినా ఘర్షణలే - ఈ సారి పర్యటన ప్రారంభం కాక ముందే పోలీసుల హెచ్చరికలు
కుప్పం నియోజకవర్గానికి సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఇటీవల ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ప్రతీ సారి అలజడి రేపుతున్నాయి. గత పర్యటన సందర్భంగా తీవ్రంగా ఘర్షణలు జరిగాయి. పలువురు టీడీపీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా రోజులు జైల్లో ఉండి.. బెయిల్ పొందారు., అందకు ముందు కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఈ సారి పర్యటన ప్రారంభానికి ముందే పోలీసులు అడ్డు చెబుతున్నారు. ప్రభుత్వం ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించకుండా నిషేధం విధించినందున.. అనుమతి తీసుకోవాలని అంటున్నారు.
పర్యటనలో ఎలాంటి మార్పులు ఉండబోవంటున్న టీడీపీ నేతలు
చంద్రబాబు సభల్లో జరిగిన దుర్ఘటనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రజాస్వామ్యంలో ర్యాలీలు నిర్వహించుకోవడం.. రాజకీయ ప్రచారం చేసుకోవడం అనేది రాజకీయ పార్టీలు, నేతల హక్కు అని.. దాన్ని నియంత్రించాలనుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో కోర్టులో చెల్లదని అంటున్నారు. ప్రభుత్వం, పోలీసులు కేసులు పెట్టినా అరెస్టులు చేసినా తమ ర్యాలీలు, రాజకీయ కార్యక్రమాలు ఆగవని అంటున్నారు. ఈ అంశంపై ముందు ముందు మరింత రాజకీయ దుమారం రేగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన జీవోపై విపక్షాలు మండి పడుతున్నాయి.
చంద్రబాబును ప్రశ్నించని వారంతా దొంగల ముఠా - రాజమండ్రిలో సీఎం జగన్ ఘాటు విమర్శలు !