పోలవరం ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలంటూ పీపీఏ, ఏపీకి కేంద్ర జలసంఘం ఆదేశాలు జారీ చేసింది. సంయుక్త సర్వే నిర్వహణకు నిర్లక్ష్యంపై CWC ఆగ్రహం వ్యక్తం చేసింది.  తెలంగాణ ఒత్తిడి చేయడంతో అధ్యయనానికి నియమిత కాలపరిమిత విధించింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది CWC. ఏప్రిల్ 10న ఏపీ, తెలంగాణతో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యలు చేపట్టాలని కేంద్ర జలసంఘం దిశానిర్దేశం చేసింది.


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపుతోపాటు, ఇతర అనేక సాంకేతిక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఏపీ, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలు గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అన్ని రాష్ట్రాలతో ఏకాభిప్రాయం సాధించాలని కోర్టు ఆదేశించింది. అందులో భాగంగా ఇప్పటికే సీడబ్ల్యుసీ రెండుసార్లు అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. ఆ క్రమంలోనే మరోసారి ఢిల్లీలో సోమవారం మూడో సమావేశాన్ని నిర్వహించింది. ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను, అభ్యంతరాలపై మరోసారి చర్చించింది.  కేంద్ర జల సంఘం చైర్మన్‌ కుష్విందర్‌  వోరా అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాలు మరోసారి తమతమ వాదనలను బలంగా వినిపించాయి.


 తెలంగాణ వాదనలు, ప్రతిపాదనలు


- పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌ లెవల్‌లో నీటిని నిల్వ చేసినప్పుడు తెలంగాణ భూభాగంలో ఏర్పడుతున్న ముంపును గుర్తించాలి. అదేవిధంగా డ్రైనేజీ, స్థానిక ప్రవాహాలు నిలచిపోవడం వల్ల వాటిల్లే ప్రభావాలపై, జూలై 2022 వరదలపై తాజాగా ఉమ్మడి అధ్యయనం చేపట్టాలి.


- ముఖ్యంగా మణుగూరు భారజల కేంద్రం, చారిత్రక భ్రదాచలం ఆలయం రక్షణకు చర్యలు చేపట్టాలి. కొత్తగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. భ్రదాచలం పట్టణంలో 8 అవుట్‌ ఫాల్‌ రెగ్యులేటర్‌ల  స్థాయిలను ధృవీకరించాలి.


- పోలవరం ప్రాజెక్టు కారణంగా కిన్నెరసాని, ముర్రేడువాగు నదుల నీటి పారుదల రద్దీకి సంబంధించి ఎన్జీటీ ఉత్తర్వులను అనుసరించి ఆ రెండు వాగులతో పాటూ  6 నుంచి 7 ఇతర పెద్ద స్థానిక ప్రవాహాలపై కూడా సర్వే చేయాలి.


- రాబోయే వర్షాకాలం దృష్ట్యా జాయింట్‌ సర్వేపై సమయం కోల్పోకుండా సత్వరమే చర్యలు ప్రారంభించాలి.


- ఛత్తీస్‌గఢ్‌ ర్రాష్టం చేసిన విధంగా ఏదైనా ఏజెన్సీతో పీపీఏ ఆధ్వర్యంలో జాయింట్‌ సర్వేను తక్షణమే చేపట్టాలి.


- పూడిక ప్రభావంతో సహా నది క్రాస్‌-సెక్షన్లను కొత్తగా తీసుకుని జాయింట్‌ సర్వే చేసి ముంపును అంచనా వేయాలి. 


- పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా తెలంగాణలో వచ్చే జూలై 2022 వరదల ప్రభావాన్ని సీడబ్ల్యుసీ అంగీకరించడం లేదు. కానీ బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డ్‌ ఆపరేషన్‌ షెడ్యూల్‌ నిబంధనలకు కట్టుబడి ప్రాజెక్ట్‌ పూర్తయిన తర్వాత ఆ ప్రభావం ఉండదని వాదిస్తున్నది. అయితే  పోలవరం బ్యాక్‌ వాటర్‌ వల్ల వరద ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో జాయింట్‌ సర్వే తర్వాత పూణేలోని సీడబ్ల్యుపీఆర్‌ఎస్‌, ఇతర నిపుణులతో వీలైనంత త్వరగా సంబంధిత మోడల్‌ అధ్యయనాలను  చేయించాలి.


- సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా రాష్ట్రాల సమస్యలను, ఆందోళను పరిష్కరించాలంటే పైన పేర్కొన్న చర్యలన్నీ చాలా అవసరం.


- అప్పటివరకు ఆంద్రపదేశ్‌ ప్రభత్వం పోలవరం ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వ చేయడం కానీ, జలాశయాన్ని నిర్వహించడం కానీ ఎట్టిపరిస్థితుల్లో చేపట్టకూడదు.


సత్వరమే సర్వేను చేపట్టాలి- కేంద్ర జలసంఘం


జాయింట్‌ సర్వే అంశంపై ఏపీని సమన్వయం చేసుకుంటూ సర్వే చేపట్టాలని పీపీఏకు అప్పుడే ఆదేశాలు జారీ చేసింది కేంద్ర జలసంఘం. సర్వే పూర్తికి నియమిత కాలపరిమితిని విధిస్తూ పీపీఏకు అల్టీమేటం జారీ చేసింది. అందులో భాగంగా తొలుత ఏప్రిల్‌ 10వ తేదీన  తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. ముంపుపై ఇరు రాష్ట్రాలు గతంలో చేసిన అధ్యయనాలపై, రూపొందించిన మ్యాపులపై చర్చించాలని దిశానిర్దేశం చేసింది. తదననంతరం ఉమ్మడి సర్వేను సత్వరమే చేపట్టాలని చెప్పింది. ఈ సమావేశానికి హాజరైన ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలు సైతం పలు డిమాండ్లను సీడబ్ల్యుసీకి నివేదించాయి. ముంపునకు సంబంధించి గోపాలకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను ఎట్టిపరిస్థితులోనూ అంగీకరించేది లేదని, కొత్తగా అధ్యయనం చేసి సర్వే, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆ రెండు స్టేట్లు డిమాండ్‌ చేశాయి.