AP Govt Employees : ఏపీ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సెక్రెటరీ దామోదర్, రాష్ట్ర సెక్రెటరీ జనరల్ సెక్రటరీ పేర్రాజు, జిల్లా అధ్యక్షుడు సంగీతరావులు సందర్శించారు. ఈ నెల 5వ తారీఖున ఈసీ మీటింగ్ విజయవాడలో నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని అమరావతి జేఏసీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధ్యాయ,పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వంతో రెండుసార్లు సమావేశాలు జరిపినా ఎలాంటి ఫలితాలు లేవన్నారు. కేవలం ఉద్యోగులు దాచుకున్న మూడు వేల కోట్ల రూపాయల మూలనిధిని మాత్రమే ప్రభుత్వం  విడుదల చేసిందన్నారు. ఇంతవరకు లిఖిత పూర్వకంగా ఉద్యోగులకు ఎలాంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 3 వేల కోట్లు ఇచ్చామని, మెడికల్ రీ ఎంబర్స్మెంట్స్ 50 కోట్లు ఇచ్చామని చెప్పుతున్నా  స్పష్టత లేదని తెలిపారు. కేంద్రం ప్రకటించిన మూడు డీఏలు రూ.222 కోట్ల నిధికి లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 


మలిదశ ఉద్యమం ఉద్ధృతం 


ఉద్యోగులకు ఇవ్వాల్సిన కొత్త డీఏలు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీఆర్సీ, అరియర్స్ ఒప్పందం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందన్నారు. తక్షణమే పీఆర్సీపై జాప్యం చేయడం మాని, కొత్త పే స్కేల్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ నిధులు విడుదల చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కొత్తగా అమలు చేసిన 13 జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. మిగతా ఉద్యోగ సంఘాలు కూడా రాబోయే మలిదశ ఉద్యమానికి సహకరించాలని కోరారు. 10 వేల కోట్ల అరియర్స్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని, మా సమస్యలను పరిష్కరించకపోతే మలిదశ ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  


ఇటీవల సీఎస్ ను కలిసిన బొప్పరాజు వెంకటేశ్వర్లు


పోరుబాట పట్టిన ఏపీ ప్రభుత్వ  ఉద్యోగ సంఘ నేతలు ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సీఎస్ జవహర్ రెడ్డితో సమావేశం అయింది.  విజయవాడలోని సీఎస్  క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో  ఉద్యోగుల ఆర్ధిక, ఆర్థికేతర అంశాలపై చర్చించారు. చర్చలు జరుగుతున్నప్పటికీ.. గురువారం నుంచి తాము ప్రకటించిన  ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని  ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రకటించారు.  ఉద్యోగుల సమస్యలపై లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకూ ఉద్యమం కొనసాగుతుందని బొప్పరాజు స్పష్టం చేసారు.  సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన ఏపీ జేఏసీ అమరావతి బృందం తమ వైఖరిని స్పష్టం చేసింది.