Minister Amarnath : ఏపీలో ముందస్తు ఎన్నికలు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెక్ పెట్టారు.  ముందస్తు ఎన్నికలు ఉండబోవని సీఎం జగన్ స్పష్టం చేశారని మంత్రి వెల్లడించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం సమీక్షించారని తెలిపారు.  ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ఇన్ ఛార్జ్ లకో సీఎం జగన్‌ సమావేశమయ్యారని తెలిపారు.  రాష్ట్రంలో 87 శాతం మందికి ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిచేకూరిందన్నారు.  క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. గడప గడపకు కింద నెలలో 20 రోజులు ప్రజల్లో ఉండాలని సీఎం పార్టీ నేతలను ఆదేశించారన్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకపోతే ఇతర పదవులతో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ మార్పులపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. కేబినెట్ లో మార్పులు తప్పుడు ప్రచారమేనని మంత్రి అమర్నాథ్‌ తెలిపారు.  


సీఎం జగన్ గడప గడపకూ సమీక్ష   


ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని  విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై క్లారిటీ ఇవ్వడానికి ఎమ్మెల్యేల సమావేశం పెట్టారని.. గడప గడపకూ సమీక్షా కార్యక్రమంలో ఎన్నికలు ఎప్పుడు ఉంటాయన్న అంశంపై స్పష్టత ఇస్తారని అనుకున్నారు. అయితే ఎమ్మెల్యేలతో సమావేశంలో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇవ్వలేదు. సమయానికే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్తారని జరుగుతున్న ప్రచారాన్ని జగన్ లైట్ తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టం చేశారు. అయితే పార్టీ కార్యక్రమాలను మాత్రం ఎన్నికల్పరచారం అన్నట్లుగా ప్రచారం చేయాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.              


ముందస్తు ఎన్నికలు ఉండవ్ 


ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల విషయంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అసలు టీడీపీ గెలిచింది నాలుగు మాత్రమేనని మొత్తం 21 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయన్నారు. అందులో టీడీపీ నాలుగే గెలిచిందన్నారు. ఈ నాలుగు స్థానాల్లో గెలిచి .. ఏదో జరిగిపోయిందని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు. వాపును చూపి బలుపు అనుకుంటున్నారని... ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ అన్నట్లుగా తెలుస్తోంది. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నామని.. జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో అన్నట్లుగా తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలు లేవని చెప్పినా.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా కార్యచరణను మంత్రులకు సీఎం జగన్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంటింటికి స్టిక్కర్ అంటించే కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యేలు ఈ ఏడాది పాటు తీరిక లేకుండా జనాల్లో తిరిగేలా భిన్నమైన కార్యక్రమాలకు రూపకకల్పన చేయబోతున్నట్లుగా తెలిపినట్లుగా తెలుస్తోంది.


ఇటీవల సీఎం జగన్ వరుసగా ఢిల్లీ పర్యటనలు జరుపుతూండటంతో .. .గవర్నర్‌తోనూ సమావేశం కావడంతో  తెలంగాణతో పాటు ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కేంద్రం అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. కేంద్రం అనుమతి లేకుండా అసెంబ్లీని రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి  పరిస్థితి రాకుండా ఉండాలంటే కేంద్రం మద్దతు అవసరమని భావిస్తున్నారు. అయితే కేంద్రం ఎలా స్పందించిందో స్పష్టత లేదు కానీ.. సీఎం జగన్ ఢిల్లీ నుంచే ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాన్ని ఖారరు చేశారు. ఆ మేరకు సోమవారం సమావేశం నిర్వహించారు.