ఎండాకాలం వస్తే వీధే కాదు, ఇల్లు కూడా నిప్పులు కొలిమే అవుతుంది! కుండలో పెట్టి కుమ్మేసిన ఫీలింగ్! మనుషులంతా దమ్ బిర్యానీలా ఉడికిపోతారు! ఫ్యాన్ ఐదో నెంబర్ మీద పెట్టినా ఫాయిదా ఉండదు ! కూలరేస్తే గానీ కూసింత ప్రాణం ఆడదు. ఏసీ వేస్తేగానీ బతకలేమన్న భావనలోకి వస్తాం! ఫలితంగా పవర్ బిల్లు తడిసి మోపెడవుతుంది. వెయ్యి రూపాయలొచ్చే బిల్లు మూడింతలు, నాలుగింతలు పెరిగిపోతుంది. బిల్లుచూసి గుండెజారి పర్సులో పడుతుంది! మార్చి నుంచి మూర్ఛనలే! ఏప్రిల్, మే నెలల్ని తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది! అటు ఎండ.. ఇటు కరెంటుబిల్లు బండ!


మీ ఇల్లు చల్లగుండాలి! జేబుకు చిల్లు పడకుండా ఉండాలి!


వేసవితాపం శాపం కాకూడదనే కోణంలో, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది ప్రభుత్వం. అందులో భాగమే తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీ! మీ ఇల్లు చల్లగుండాలి! మీ జేబుకు చిల్లు పడకుండా ఉండాలి! ఈ కాన్సెప్టుతో రూపొందించిందే కూల్ రూఫ్ పాలసీ. మంత్రి కేటీఆర్ దీన్ని ఆవిష్కరించారు. కూల్‌రూఫ్‌ పాలసీ భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని మంత్రి అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో, అందరికీ లాభం చేకూరేలా పాలసీ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. భవిష్యత్ తరాల కోసం తెస్తున్న పాలసీగా అభివర్ణించారు. ఈ సంవత్సరం సిటీలో 5 చదరపు కి.మీ. నగరం అవతల 2.5 స్క్వేర్ కి.మీ. కూల్ రూఫ్ చేస్తామన్నారు. సైకిల్ ట్రాక్‌కు కూడా సోలార్ రూఫ్ చేస్తున్నామని తెలిపారు. తమ ఇంటికి ముందే కూల్ రూఫ్ చేయించామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రతీ చదరపు మీటర్‌కు రూ. 300 ఖర్చవుతుందని, రూఫ్‌తో పాటు గోడలకు కూడా వేయాలని సూచించారు. దీన్ని తప్పనిసరి చేస్తున్నామని తెలిపారు. కూల్ రూఫ్ ఉంటేనే అక్యూపెన్సి సర్టిఫికెట్ ఇస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.


కూల్‌ పెయింట్ వేయడం వల్ల కరెంట్‌ చార్జీలు ఆదా


దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్‌ రూఫ్‌ పాలసీని రూపొందించామని తెలిపారు కేటీఆర్. డబుల్ బెడ్‌రూం ఇళ్లపై కూల్‌రూఫ్‌ అమలు చేస్తామన్నారు. కూల్‌ పెయింట్ వేయడం వల్ల కరెంట్‌ చార్జీలు ఆదా అవుతాయిని అన్నారు. ఇప్పటికే కట్టిన భవనాలపై కూడా కూల్‌రూఫ్‌ విధానం అమలు చేయొచ్చని సూచించారు. విద్యుత్ వాహనాల వినియోగం పెరగాలనేది సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. పాలసీ, చట్టం చేయడం చాలా సులువు.. కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టమని అన్నారు.  


ప్రతి అపార్టుమెంటుకు వెళ్లి అవగాహన


కూల్ రూఫ్ అమలు చేస్తే రెండు సంవత్సరాల్లో ఎనర్జీ సేవింగ్ రూపంలో మన డబ్బులు మనకు వస్తాయన్నారు కేటీఆర్. హైదరాబాద్ సహా అన్ని మున్సిపాలిటీల్లో దీన్ని అమలు చేస్తామని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పిస్తే 100 శాతం అమలవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి అపార్టుమెంటుకు వెళ్లి అవగాహన కల్పించాలని అన్నారు. అవసరమైతే ఇన్సెంటివ్ ఇస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. RWSను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తామని వెల్లడించారు. త్వరలో మన నగరం కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఎక్కడ చూసినా మిద్దె తోటలు కనిపిస్తున్నాయని,, వాటిని ఎంకరేజ్ చేయాలని చెప్పుకొచ్చారు. దేశం మొత్తంలోనే హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్‌ ఉందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాదులో ఉన్న అవకాశాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. TS బీపాస్‌తో దేశంలో ఎక్కడాలేని విధంగా భవన నిర్మాణ అనుమతులు లభిస్తున్నాయన్నారు. 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.