తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంశం ఇప్పుడు రాష్ట్రపతి వరకూ వెళ్లింది. బీఎస్సీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఎస్పీఎస్సీ వ్యవహారంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. టీఎస్పీఎస్సీకి చెందిన పరీక్షా పేపర్ల లీకేజీ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించి సమగ్ర విచారణ జరిపించాలని లేఖ రాశారు. లీకేజీ వెనుక ముఖ్యమంత్రి లేదా మంత్రి కార్యాలయ ఉద్యోగుల పాత్ర ఉందేమో తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కమిషన్‌ను బర్తరఫ్ చేయాలని లేఖలో రాష్ట్రపతిని కోరారు.
‘‘టీఎస్పీఎస్సీ కుంభకోణంలో తెలంగాణ సీఎంవో పాత్రను బహిర్గతం చేయడం కోసం సీబీఐ విచారణ, ప్రస్తుత కమిషన్‌ను బర్తరఫ్ చేయాలని కోరుతూ నేను రాసిన లేఖను మీతో షేర్ చేసుకుంటున్నా. మీరు కూడా ఇట్లనే భారత రాష్ట్రపతికి లేఖలు రాయగలరు’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
‘‘TSPSC పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు గగ్గోలు పెడుతుంటే, నమస్తే తెలంగాణ మాత్రం బీఆర్ఎస్ భజన చేస్తుంది. ఉద్యోగాలు భర్తీ చేయడం బీఆర్ఎస్ కు చేతకాదని తేలిపోయింది. బీఎస్పీ అధికారంలోకి రాగానే 10 లక్షల ఉద్యోగాలు సృష్టించి, పారదర్శకంగా భర్తీ చేస్తాం’’ అని మరో ట్వీట్ చేశారు.
ఈడీ రంగంలోకి..
మరోవైపు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలతో ఈడీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. పేపర్ లీక్ పై సిట్‌తో పాటుగా ఈ అంశంలో ఈడీ కూడా విచారణ చేయబోతుంది. ఎగ్జామ్ పేపర్స్ లీక్ స్కా్మ్‌లో హవాలా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే అరెస్టు అయిన 15 మందిని తిరిగి ఈడీ విచారణ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అవసరమైన పక్షంలో టీఎస్పీఎస్సీ సభ్యులతో పాటు సెక్రెటరీని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మొత్తానికి తెలంగాణలో ఈడీ దూకుడు పెంచుతోంది. రెండు ముఖ్యమైన కేసులపై ఈడీ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు డాటా లీక్ పైన కూడా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ విషయంలో బ్యాంకులతోపాటు పలు సంస్థలకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ–కామర్స్, ఐటీ కంపెనీలు వినియోగదారుల సమాచారంలో గోప్యత, భద్రత పాటించకపోవడం వల్లే డేటా లీకైనట్టు సైబరాబాద్ పోలీసులు నిర్ధారించారు. బిగ్ బాస్కెట్, ఫోన్ పే, ఫేస్‌బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, అస్ట్యూట్ గ్రూప్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, మాట్రిక్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకు అఫ్ బరోడా సంస్థలకు సెక్షన్ 91 కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.