Minister Indrakaran Reddy : తెలంగాణ రాకముందు రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండేవని, కానీ బీఆర్ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినట్లు  మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి  అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నాణ్యమైన‌ కరెంట్​ సప్లై చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సోమవారం సారంగాపూర్ మండ‌లం సిర్పల్లి గ్రామంలో  132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి  భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.... సబ్ స్టేషన్ నిర్మాణంతో లోఓల్టేజీ స‌‌మ‌‌స్య తీర‌‌డంతోపాటు నిరంతరం క్వాలిటీ కరెంట్​ అందుతుంద‌‌న్నారు. నియోజకవర్గంలో 50కి పైగా సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, సారంగపూర్ మండలంలోనే సుమారు 9 సబ్ స్టేషన్లు నిర్మించుకున్నామని మంత్రి చెప్పారు. 


గిరిజనుల ప్రత్యేక నిధికి భారీగా నిధులు 


ఉమ్మడి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటే గిరిజనులు కూడా అణచివేతకు, ఆర్థిక వెనుకబాటుకు గురయ్యారని, దీని దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గిరిజనులకు ప్రత్యేక నిధి ఏర్పాటుచేసి భారీగా నిధులు కేటాయించిందని  మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా గ‌తంలో 6 శాతం ఉన్న ఎస్టీ రిజ‌ర్వేష‌న్లను జనాభా దామాషా ప్రకారం 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింద‌ని గుర్తు చేశారు. ఫ‌లితంగా గిరిజ‌నుల‌కు విద్య, ఉద్యోగ అవ‌కాశాలు పెరిగాయని తెలిపారు. మరోవైపు గిరిజన తండాలు, మారుమూల గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి పాలన చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నదని పేర్కొన్నారు. మండలాల్లో రహదారులు లేని గిరిజనతండాలకు ప్రభుత్వం బీటీ రోడ్లు మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గంలోని  సారంగాపూర్, మామ‌డ  మండ‌లాల్లో అత్యధికంగా ఉన్న గిరిజనతండాలకు బీటీ రోడ్లు నిర్మిస్తున్నామ‌ని వెల్లడించారు. అనంత‌రం  సారంగాపూర్ మండ‌లం బీర‌వెల్లి నుంచి జాం  గ్రామాల మ‌ధ్య ర‌హ‌దారిపై హైలైవ‌ల్ వంతెన నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు.