Support For chandrababu :    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం టీడీపీ నేతలు నిరాహారదీక్షలు.. ఇతర కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ప్రజలు మాత్రం స్వచ్చందంగా రోడ్ల మీదకు వస్తున్నారు. వారికి వారు మాట్లాడుకుని ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పోలీసులు తీవ్రమైన నిర్బంధాలు పెడుతున్నప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.  ఎమర్జెన్సీ తరహా నిర్బంధాల మధ్య కూడా ప్రజలు అనూహ్యంగా రోడ్ల మీదకు వస్తూండటం ఆశ్చర్య పరుస్తోందని టీడీపీ నేతలంటున్నారు.  రెండు రోజుల కిందట విజయవాడ  బెంజ్ సర్కిల్ లో మహిళల పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తాజాగా శనివారం గుంటూరులో మహిళలు ఆ బాధ్యత తీసుకున్నారు. ఒక్క సారిగా నాలుగైదు వేల మంది మహిళలు రోడ్లపైకి వచ్చారు. ఇలా వచ్చారని తెలిసి ఇతర మహిళలూ వారితో  జత కలిశారు. దీంతో ఆ ర్యాలీ మహా ర్యాలీగా మారింది. మధ్యలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా  సాధ్యం కాలేదు. 


చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు చేయాలనుకుంటున్న సామాన్యులు, కాలనీల ప్రజలు వారికి వారు మాట్లాడుకుని.. ఓ సమయం చూసుకుని ర్యాలీలు ప్రారంభిస్తున్నారు.  ఈ స్వచ్చంద నిరసనలు అంతకంతకూపెరుగుతున్నాయి. ముందు కృష్ణా  జిల్లా మహిళలు ప్రారంభించారు. మెల్లగా ఇతర నగరాలకు విస్తరిస్తున్నాయి. ఇక గ్రామాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ గ్రామంలోనూ ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. దేవుడికి కొబ్బరి కాయలు కొట్టడం వంటి వాటి దగ్గరనుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులతో అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.                 


మరో వైపు తెలంగాణలో కూడా నిరసన పెరుగుతున్నాయి. మొన్న  ఖమ్మం, సత్తుపల్లిలో నిరసనలు జరిగాయి. తాజాగా నల్లగొండ జిల్లా కోదాడ,  నిజామాబాద్ వంటి చోట్ల కూడా ప్రజలు స్వచ్చందంగా ర్యాలీలు నిర్వహించారు. ఇక హైదరాబాద్ గురించి చెప్పాల్సి పని లేదు. వీరిలో టీడీపీ సానుభూతిపరులు ఉన్నా.. ప్రస్తుతం అక్కడ  పార్టీ కార్యకలాపాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు వందల సంఖ్యలో ర్యాలీలో పాల్గొనడం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యపోతుంది.  చంద్రబాబుకు మద్దతుగా ప్రజా ఉద్యమం ఉద్ధృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ అంచనా వేస్తున్నారు.                    


తెలుగుదేశం పార్టీ కూడా   ప్రజల నిరసనను ఉద్యమంలా మార్చాలని నిర్ణయించుకుంది. పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ.. రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు పోస్టు కార్డు పంపాలని టీడీపీ ప్రజల్ని కోరింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మంగళవారం జరగనుంది.