CM KCR : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. సీఎం కేసీఆర్ నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలహారతి పట్టారు. అతి పెద్ద మహా బలి మోటార్ ద్వారా శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా హెడ్ రెగ్యులేటరీ, ఇంటెక్ వెల్, సొరంగ మార్గాల ద్వారా సజ్జపూల్‌లోకి చేరిన కృష్ణా జలాలు….. మొదటి పంపు నుంచి డెలివరీ మెయిన్స్ ను దాటుకొని నార్లాపూర్ జలాశయానికి విజయవంతంగా చేరుతాయి. భూగర్భంలో పంపుహౌజ్ ఏర్పాటు. చేశారు.
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజు 2 టీఎంసీల నీరు లిఫ్ట్ చేసే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కాళేశ్వరం రికార్డును బ్రేక్ చేసేలా 145 మెగావాట్ల కెపాసిటీ కలిగిన 9 బాహుబలి మోటార్లను ఏర్పాటు చేశారు. 915 కిలోమీటర్ల ప్రాథమిక కాల్వను నిర్మించారు. రోజుకు 3,200 క్యూసెక్కులు ఎత్తిపోయగల కెపాసిటీ ఉన్న ఈ పంపు ద్వారా రెండు టీఎంసీల నీటిని అంజనగిరి (నార్లాపూర్) జలాశయానికి తరలించి నిల్వ చేస్తారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.35 వేల కోట్లు ప్రభుత్వం ఇప్పటివరకూ ఖర్చు చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలో 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు 1200 గ్రామాలకు తాగునీరందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. పరిశ్రమలకు 0.33 టీఎంసీల నీటిని వినియోగిస్తారు.
ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా నాగర్ కర్నూలు చేరుకున్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ కొల్లాపూర్‌కు బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యలో నాగర్‌కర్నూల్ తేజ గార్డెన్స్‌లో లంచ్ చేసి.. కొల్లాపూర్‌కు వెళ్లారు కేసీఆర్. నాగర్‌కర్నూల్‌లో కేసీఆర్‌కు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న స్వాగతం పలికారు.
శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి దక్షిణ తెలంగాణలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు 1,200 గ్రామాలకు తాగునీటిని అందించడానికి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. 2015 జూన్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టగా మొదటి పంపు ప్రారంభానికి ఎనిమిదేళ్లు పట్టింది. ఎట్టకేలకు నార్లపూర్‌లోని పంపుహౌజ్‌లోని మొదటి పంపును రన్ చేసి అంజనగిరి జలాశయంలోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ప్రతి రోజు 0.25 టీఎంసీల చొప్పున మొత్తం 2 టీఎంసీ నీటిని ఎత్తిపోస్తారు.
మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా.. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకొన్నాయి. ఇక ప్రాజెక్టు ద్వారా నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,226 గ్రామాలకు తాగు, సాగునీరు అందనున్నది. ప్రాజెక్టు నీళ్లతో 1,546 నీటికుంటలు, చెరువులను నింపనున్నారు.