కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నమాట ఈ దొంగలకు ఇలా అర్ధం అయినట్టుగా ఉంది. ఏదో సాంప్రదాయంగా ఒకటో రెండో సెల్ ఫోన్ లు దొంగతనం చేస్తాడు ఏ దొంగైనా...  వీళ్ళు ఏకంగా  కంటైనర్‌లే లేపేశారు. సెల్‌ఫోన్‌ లోడ్ ఖాళీ చేశారు.  వేలు లక్షల్లో కాదు 1.3 కోట్ల విలువైన సెల్ ఫోన్ కంటైనర్ ను ఇద్దరు డ్రైవర్లు చోరీ చేశారు.


ఈనెల 11వ తేదీన జరిగిన  ఈ చోరీ తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారి ఓ ఓబులాపురం మిట్ట సమీపంలో  1.3 కోట్ల విలువైన సెల్ ఫోన్ లోడుతో వెళ్తున్న కంటైనర్ ను ఇద్దరు డ్రైవర్లు చోరీ చేశారు. ఈ కంటైనర్ సెల్ ఫోన్ల లోడుతో  హర్యానా నుంచి బెంగళూరు వైపు వెళ్తుంది.  బెంగళూరు తీసుకెళ్లాల్సిన కంటెయినర్‌ను రోడ్డుపక్కన ఆపిన డ్రైవర్లు అందులోని 1.3 కోట్ల రూపాయలకుపైగా విలువైన సెల్‌ఫోన్లను మరో వాహనంలోకి మార్చేశారు. ఆపై కంటెయినర్‌ను అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. నాగాలాండ్‌కు చెందిన కంటెయినర్ యజమాని ఫిర్యాదుతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.


డ్రైవర్లే చోరీకి యత్నం...



సెల్ ఫోన్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ డ్రైవర్లే చోరీకి చోరీకి ఎత్తించినట్లు కంటైనర్ యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలా తెలివిగా రోడ్డు పక్కన ఆపి సెల్‌ఫోన్లను మరో వాహనంలోకి మార్చారన్నారు. కోట్ల విలువ చేసే సెల్ ఫోన్లతో పాటు తన కంటైనర్ ను రోడ్డుపై నిలిపి పరారైనట్లు  తెలిపారు. గత కొన్ని నెలల నుంచి డ్రైవరు తన వద్దే పనిచేస్తున్నట్లు కంటైన యజమాని తెలిపారు. ఇప్పటివరకు వారిద్దరు ఎలాంటి దొంగతనాలకు పాల్పడలేదని... ఇప్పుడు ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదని కంటైనర్ యజమాని వెల్లడించారు. పోలీసులు పూర్తి విచారణ చేపట్టి ఇందుకు బాధ్యులు ఎవరో వెల్లడించాలని కోరారు.


కంటైనర్ డ్రైవర్లను పట్టుకుంటాం: పోలీసులు



కంటైనర్ లోని సెల్ ఫోన్లను దొంగలించి పారిపోయిన డ్రైవర్లను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.  కంటైనర్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్లు జాతీయ రహదారి పక్కన వదిలి వెళ్లిన కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వీరి కోసం బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వీరికి సహకరించిన వారిపై కూడా నిగా పెట్టినట్లు తెలిపారు. వేరే వాహనంలోకి మార్చిన సెల్ ఫోన్లను ప్రస్తుతం ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే దానిపైన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో దొంగలను పట్టుకొని అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.