జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు ఏపీ బీజేపీ ఇన్‌చార్జి మురళీధరన్‌తో భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం (ఏప్రిల్ 4) మురళీధరన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కల్యాణ్ తో ఉన్నారు. వీరు మురళీధరన్‌తో కీలక చర్చలు జరిపారు. పవన్ కల్యాణ్ నిన్న కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, మురళీధరన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. నేడు మళ్లీ మురళీధరన్‌తో పవన్ మరోసారి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై పవన్ కల్యాణ్ మురళీధరణ్ తో చర్చించినట్లు సమాచారం. మురళీధరన్ తో సమావేశం అనంతరం అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు పవన్ కల్యాణ్ ను కలిసి, భేటీ గురించి మాట్లాడాలని కోరగా ఆయన తిరస్కరించారు. ఇతర బీజేపీ నేతలను కూడా కలవాల్సి ఉందని, వారిని కూడా కలిసిన తర్వాత అన్ని విషయాలు మీడియాతో చెప్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. నేడు సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ భేటీ అవుతారని సమాచారం.