AP Early Elections: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూచించారు. అలాగే తన ఫొటో పెట్టుకునే ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పిన సీఎం జగన్... ఇప్పుడు ఎమ్మేల్యేల తీరు బాగాలేదనడం సమంజసం కాదన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్యే స్థానాల ఎన్నికలను ప్రామాణికంగా తీసుకుంటే పులివెందులలోనే టీడీపీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి అత్యధికంగా ఓట్లు వచ్చాయని వివరించారు. పులివెందులలో తమ పార్టీ పరిస్థితిపై తక్షణమే సమీక్షించాల్సి ఉందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పులివెందులలో పోటీ చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని సవాలు విసిరడం విడ్డూరమని పేర్కొన్నారు.
పులివెందులలో అధికార పార్టీని ఓడించడానికి బీటెక్ రవి సరిపోతారనే ధీమాలో ప్రతిపక్షం ఉన్నట్లు కనిపిస్తోందని ఎంపీ రఘురామ అన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా కృష్ణా, గుంటూరు, జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనతో గంటల్లో 1,130 ఎకరాలను జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీకి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ కేటాయించడం ఆశ్చర్యకరమని ఎంపీ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో రైతుల మరణాలన్నీ తమ ప్రభుత్వ హత్యలేనని నిందించారు. విశాఖలో వేల ఎకరాలను కబ్జా చేశారని, ఆ భూములను పేదలకు పంచాలని రాష్ట్ర సర్కారుకు సూచించారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనతో 24 గంటల వ్యవధిలో 1100 చిల్లర ఎకరాల భూమిని జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీకి సీఆర్డీఏ కమిషనర్ శ్రీలక్ష్మి కేటాయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని రఘురామకృష్ణ రాజు గారు విస్మయం వ్యక్తం చేశారు. ఈ తరహా ఆర్డర్లు ఇవ్వడానికి శ్రీ లక్ష్మీ ఎప్పుడూ రెడీగా ఉంటారని, ప్రభుత్వ పెద్దలు కడుపుమంటతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టులో రాజధాని కేసు వాదించడానికి వందల కోట్లు వెచ్చించి న్యాయవాదులను నియమించుకొని, కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొని కూడా తమ పంతాన్ని నెగ్గించుకోలేకపోయామనే అక్కసుతోనే రైతులను వేధించాలనే ఉద్దేశ్యంతోనే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారని అన్నారు.
మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా ఎటువంటి నిర్ణయాలను తీసుకోరాదని ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసిందని, ఈ తప్పును ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలకు ప్రస్తుతం ఓట్ల భయం పట్టుకుందని, ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు గారు, ఆ దత్త పుత్రుడు అడ్డుకుంటున్నారని... పేదలకు ఇల్లు ఇవ్వడం మంచిదా?, ఆపడం మంచిదా అంటూ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశారని గుర్తు చేశారు. పేదవారు సినిమాని చూడడానికి టికెట్ల ధరలను తగ్గిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు అంటున్నారోనని దొంగ ఏడుపులు ఏడ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు, సినిమా నిర్మాతలు, హీరోలు వచ్చి కలిసి మాట్లాడిన తరువాత డీల్ సెట్ అవ్వగానే పేదలంతా ధనవంతులైనట్టుగా సినిమా టికెట్ల ధరలను పెంచేశారని అన్నారు.