Parvatipuram News : పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చిన తోలుమండ గ్రామానికి చెందిన కొండగొర్రి కాసులమ్మ అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం చినతోలుమండ గ్రామం నుంచి డోలీ సాయంతో కొండ కిందికి దించారు. అక్కడి నుంచి ఫీడర్ అంబులెన్స్ లో సమీపంలోని రావాడ రామభద్రాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించడంతో పండంటి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. సకాలంలో వైద్య సేవలు అందడం వలన తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు. చిన తొలిమండ గ్రామానికి రహదారి సదుపాయం లేకపోవడం వలన ఎవరికి ఏ జబ్బు చేసిన సరే వారికి డోలి మోతలే శరణ్యం. 


గర్భిణీ వసతి గృహాలు


ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఆ గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాల్సిందిగా గ్రామస్తులు వేడుకుంటున్నారు. రానున్నది వర్షాకాలం ఆరోగ్య సమస్యలు ఏం వచ్చినా మాకు డోలీ మోతలే దిక్కు. ఒక పక్క డోలీ మోస్తూ ఇంకొకపక్క వర్షంలో తడుస్తూ మోసుకు వచ్చినప్పుడు పిడుగులు పడతాయని భయం, అధిక వర్షం కురిస్తే ఏంచేయాలనే భయం ఉంటాయని గిరిజనులు అంటున్నారు.  గతంలో అప్పటి పీవో డాక్టర్ లక్ష్మీష ఏర్పాటుచేసిన గర్భిణీ వసతి గృహానికి ఏడు నెలలు నిండిన గిరిజన గర్భిణీలను తరలించేవారు. అలాంటి వసతి గృహాలు ఏర్పాటు చేస్తే గిరిజనుల ప్రాణాలు కాపాడే వాళ్లవుతారని ప్రజలు కోరుతున్నారు.  


విజయనగరంలో విషాదం 


విజయనగరం జిల్లా గరివిడి మండలం కుమరాం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నిన్న కురిసిన భారీ వర్షాలకు గోడకూలి ఒకే ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలైయ్యాయి. రాత్రి మూడు గంటల సమయంలో గోడ కూలడంతో ఇంట్లో నిద్రిస్తున్న అడ్డాల ఆరిసిత్ వర్మ(6), అడ్డాల లక్ష్మి(48) అక్కడికక్కడే మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక కుటుంబంలో ఇద్దరు మృతి చెందడం, మరో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. పక్కింటి వాళ్లు నూతన ఇంటి నిర్మాణానికి పునాదులు తీయడంతో దానికి ఆనుకుని ఉన్న పెంకుటిల్లుకి బలం తగ్గడంతో వర్షానికి కూలినట్లు తెలుస్తుంది. 


Also Read : Reactions On Ambedkar : రాజ్యాంగ నిర్మాతకు అవమానం -పైగా ప్రశ్నించిన దళితులపై కేసులా ? - పవన్, లోకేష్ ఫైర్ !


Also Read : YSRCP Plenary 2022: నేను వైసీపీ ప్రాథమిక సభ్యుడ్ని, ఆ తరువాతే MLA, స్పీకర్ పదవులు: తమ్మినేని కీలక వ్యాఖ్యలు