Ongole Parliament Constituency: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారని వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేది లేదని ఇప్పటికే వైసీపీ అధిష్టానం తేల్చేసింది. దీంతో టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. నేడో, రేపో చంద్రబాబుతో మాగుంట భేటీ అయ్యే అవకాశముందని సమాచారం. అనంతరం టీడీపీలో చేరికపై అధికారిక ప్రకటన చేయనున్నారు. దీంతో వైసీపీకి మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ, జనసేనలో చేరగా.. ఇప్పుడు మాగుంట కూడా జగన్‌కు హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒంగోలు ఎంపీ సీటును వేరే వారికి కేటాయించేందుకు వైసీపీ సిద్దమవ్వడంతో..  ఆ పార్టీలో గత కొద్దిరోజులుగా మాగుంట తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో సైకిలెక్కేందుకు టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.


టీడీపీలో చేరికపై చంద్రబాబుతో చర్చలు! 
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇటీవల మాగుంట ఢిల్లీ వెళ్లారు.  సమావేశాలు ముగియడంతో మాగుంట ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం లేదా బుధవారం  హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో మాగుంట భేటీ కానున్నారని తెలుస్తోంది. టీడీపీలో చేరే విషయంపై చంద్రబాబుతో చర్చలు జరుపనున్నారని సమాచారం. ఎంపీ టికెట్‌పై హామీ ఇస్తే పసుపు కండువా కప్పుకోవాలనే ఆలోచనలో మాగుంట ఉన్నారు. టికెట్‌పై క్లారిటీ వస్తే టీడీపీలో చేరికపై ఒంగోలులో మాగుంట అధికారిక ప్రకటన చేయనున్నారు.  గత ఎన్నికల ముందు మాగుంట టీడీపీలోనే ఉన్నారు. కానీ మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా గెలిచారు. లిక్కర్ స్కాంలో మాగుంట చిక్కుకోవడం, వైసీపీ అధిష్టానం ఆయనకు అండగా నిలబడకపోవడంతో  గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. చివరికి ఎంపీ టికెట్‌ కూడా ఇవ్వనని సీఎం జగన్ చెప్పడంతో టీడీపీ గూటికి చేరేందుకు మాగుంట సిద్దమవుతున్నారు.


ఒంగోలు ఎంపీ టికెట్‌ ఎవరికో!
మాగుంటకు టికెట్ ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కోరారు. మాగుంటకు ఇవ్వకపోతే తాను కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. అయినా వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రీజినల్ కో ఆర్డినేటర్‌గా జగన్ నియమించారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఇప్పటివరకు వైసీపీ అధిష్టానం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఒంగోలు ఎంపీ టికెట్‌ను వైసీపీ అధిష్టానం ఎవరికి కేటాయిస్తుందనేది సస్పెన్స్‌గా మారింది. 


మాగుంట కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1998, 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఒంగోలు ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం 2015లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.  2019లో మార్చి 16న టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు.