YS Jagan: కర్ణాటకలో పండిన మామిడి పంటను కేంద్రం కిలో 16 రూపాయలకు కొంటుందని ఏపీలో చంద్రబాబు ఏం చేస్తున్నరాని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులను వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలతో మార్కెట్‌లో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కారుపై జగన్ విమర్శలు చేశారు. 

బంగారుపాళ్యంలో తన పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను దారుణంగా వాడుకుందని ఆరోపించారు జగన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్‌బీకేలు రైతుల బాగుకోసం పని చేశాయని అన్నారు. వాటిని నిర్వీర్యం చేసిన చంద్రబాబు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు. ఏ పంటకీ గిట్టుబాటు ధరలేకుండా పోయిందని వాపోయారు. 

జగన్ ఇంకా ఏమన్నారంటే"రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. రైతుల మీద ప్రభుత్వమే కుట్రలు చేయడం మరింత ఘోరం. వైఎస్సార్‌సీపీ హయాంలో మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాం. కర్ణాటకలో కేంద్రమే కేజీ మామిడి రూ.16 కొంటోంది. కర్ణాటకలో కేంద్రం మామిడి కొనుగోలు చేస్తుంటే చంద్రబాబు ఇక్కడ గాడిదలు కాస్తున్నారా? రాష్ట్రంలో కిలో మామిడికి కనీసం 12 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు." అని అన్నారు. 

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడ రైతులకు మేలు చేసేలై ఆర్బీకేలు ఏర్పాటు చేశామన్నారు జగన్. ఇప్పుడు వాటిని పూర్తిగా నాశనం చేసి రైతుల గొంతు కోస్తున్నారని మండిపడ్డారు. "మా ప్రభుత్వ హయాంలో రైతన్నను ఆర్బీకేలు చేయిపట్టి నడిపించాయి. ఇప్పటి వరకూ రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వలేదు. ఇన్‌ పుట్‌ సబ్సిడీ అందించలేదు. మా ప్రభుత్వంలో కేజీ మామిడి రూ.22 నుంచి రూ.29లకు కొన్నాం. కేజీ మామిడి కాయలు రూ.2లా? ఇదేం దారుణం. మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారు. రైతులు దివాళా తీసేలా ప్రభుత్వం చేసింది. మామిడి ఫ్యాక్టరీలు, ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తున్నాయి. చంద్రబాబు రాకతో ఆర్‌బీకేలు, అగ్రి టెస్ట్‌ ల్యాబ్‌లు నిర్విర్యమయ్యాయి." అని ఆరోపించారు. 

రాష్ట్రంలో మామిడి పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. రైతులను పూర్తిగా ఆదుకోవాలని అన్నారు. రైతుల తరుఫున ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ప్రతీ రైతుకు అండగా ఉంటామన్నారు. 

పర్యటన కోసం వస్తున్న రైతుల తలలు పగలగొట్టారని జగన్ ఆరోపించారు. వందల మందిపై కేసులు పెట్టారని అన్నారు. "నా పర్యటనకు వస్తున్న రైతుల పగలకొడతారా? 12వందల మందిని జైల్లో పెడతారా? రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా? కూటమి ప్రలోభాలు, లంచాలకు పోలీసులు లొంగొద్దు. రేపు పోలీసులను చంద్రబాబు మోసం చేస్తారు. అప్పుడు కూడా నేనే రావాల్సి ఉంటుంది. అని జగన్ అభిప్రాయపడ్డారు.