AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కు అప్పులు రాకుండా, పెట్టుబడులు రాకుండా వివిధ సంస్థలకు, వ్యక్తులకు దాదాపుగా రెండు వందల మేర ఫేక్ ఈమెయిల్స్ పంపారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ కేబినెట్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ అంశంపై తనకు సమాచారం రావడంతో పంపించిన వ్యక్తి ఎవరో ఆరా తీశానని ఉదయ్ భాస్కర్ అనే జర్మనీలో ఉండే వైసీపీ సానుభూతిపరుడితో ఈ ఫేక్ ఈమెయిల్స్ పంపించారని గుర్తించారు. ఈ అంశంపై చంద్రబాబు స్పందించారు. ఏపీపై కుట్రలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే.. ఈ అంశంపై ప్రజలకు నిజాలు వివరించాలన్నారు.
జర్మనీలో పని చేసే వ్యక్తి ద్వారా తప్పుడు సమాచారాలతో ఈ మెయిల్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ,ఆయన సన్నిహితులు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి 200కి పైగా ఈ-మెయిల్‌లను బాంబే స్టాక్ మార్కెట్‌లోని పెట్టుబడిదారులకు పంపారని పయ్యావుల కేశవ్ మంగళవారం ప్రెస్ మీట్‌లో ఆరోపించారు. ఈ ఈ-మెయిల్‌లు జర్మనీలోని విప్రోలో పనిచేస్తున్న ఉదయభాస్కర్ అనే వ్యక్తి ద్వారా పంపించారని గుర్తించారు. ఈ మెయిల్‌లలో ప్రభుత్వ విధానాలు , ప్రాజెక్టుల గురించి తప్పుడు సమాచారం ఉందని, ఇది పెట్టుబడిదారులలో భయం , గందరగోళం సృష్టించే ఉద్దేశ్యంతో జరిగిందని ఆయన ఆరోపించారు.
తప్పుడు ప్రచారంతో రుణాన్ని ఆపలేకపోయిన వైసీపీ నేతలు
ఈ కుట్రల కారణంగా ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMDC) ద్వారా రూ. 9,000 కోట్ల నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్స్ (NCDs) జారీ చేసే ప్రయత్నంలో అడ్డంకులు ఏర్పడ్డాయని కేశవ్ ఆరోపించారు. వైసీపీ నాయకులు, ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సెబీలకు ఫిర్యాదులు చేశారని, అలాగే వైసీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారని తెలిపారు. ఇలా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అలా వివాదం కోర్టులో ఉందని అందరికీ మెయిల్ చేశారని తెలిపారు.
తప్పుడు ఈ మెయిల్స్ పెట్టే వారిపై కఠిన చర్యలు
రాష్ట్రంలో అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి, ప్రజలు తమకు ఓటు వేయనందుకు ప్రతీకారంగా వైసీపీ ఈ చర్యలు చేపట్టిందని కేశవ్ ఆరోపించారు. ఈ చర్యలను దేశద్రోహంగా పరిగణించి, జగన్ , ఆయన సన్నిహితులపై కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు ఆయన తెలిపారు. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ, RBI మరియు సెబీలు క్లియరెన్స్ ఇచ్చాయని, పెట్టుబడిదారులు ఆసక్తి చూపడంతో ఓవర్-సబ్‌స్క్రిప్షన్ జరిగిందని కేశవ్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం 2024 మార్చిలో రూ. 7,000 కోట్ల రుణాల కోసం జీవో జారీ చేసినప్పటికీ, పెట్టుబడిదారుల విశ్వాసం లేకపోవడంతో ఆ రుణాలు సమకూరలేదని కేశవ్ పేర్కొన్నారు.
ఈ అంశాన్ని పయ్యావుల కేబినెట్ దృష్టికి తేవడంతో ఈ-మెయిల్ కుట్రలపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.