IAF Aircraft Crashes | జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రతన్‌గఢ్ పట్టణం సమీపంలో భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం కూలిపోయింది. భానుడా గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. నివేదికల ప్రకారం, ఈ విమానం భారత సాయుధ దళాలు (IAF)కు చెందినది. మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో భానోడాలోని వ్యవసాయ పొలంలో విమానం కూలిపోయిందని పోలీస్ అధికారి రాజల్‌దేశర్ కమ్లేష్ పిటిఐకి తెలిపారు. ప్రమాద స్థలానికి సమీపంలో మానవ శరీర భాగాలు కనిపించాయని తెలిపారు.
పెద్ద శబ్ధంతో కూలిన IAF ఎయిర్ క్రాఫ్ట్
స్థానికులు ఈ ప్రమాదంపై మాట్లాడుతూ.. తాము పెద్ద శబ్దం విన్నామని, ఆ తర్వాత ప్రమాద స్థలం నుండి పొగలు రావడాన్ని గమనించినట్లు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్, జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐఏఎఫ్ యుద్ధ విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో పైలట్ మృతిచెందాడని సమాచారం.
భారత సైన్యం, వైమానిక దళానికి చెందిన అధికారులు సంఘటనా స్థలానికి బయలుదేరారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.