Gambhira bridge collapsed: గుజరాత్‌లోని మహిసాగర్ నదిపై నిర్మించిన బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. వంతెన కూలిపోవడంతో 5 వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా, మరికొందరిని రెస్క్యూ టీమ్ రక్షించింది. ఈ వంతెన 1985లో నిర్మించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సాంకేతిక నిపుణులను సంఘటనా స్థలానికి పంపి విచారణకు ఆదేశించారు.
మహిసాగర్ నదిపై వంతెన కూలిపోయిన ఘటనపై గుజరాత్ రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి పిఆర్ పటేలియా మాట్లాడుతూ, "గంభీర వంతెన దెబ్బతిందని మాకు సమాచారం అందింది. మరమ్మతులు చేపట్టాల్సి ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. నిపుణుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించాం" అని అన్నారు.
హెచ్చరికలు జారీ చేసినా వంతెనపై ఆగని రాకపోకలు
గంభీర బ్రిడ్జి కూలిపోవడంతో నదిలో 5 వాహనాలు పడిపోయాయి. రెండు ట్రక్కులు పూర్తిగా నదిలో మునిగిపోగా, ఒక ట్యాంకర్ వంతెన కూలిన అంచు వద్ద నిలిచిపోయింది. వంతెన కూలిపోగానే దానిమీద వెళ్తున్న వాహనాలు నదిలో పడిపోవడంతో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
1981లో ఈ వంతెన నిర్మాణం చేపట్టగా, పనులు పూర్తయ్యాక 1985లో ప్రారంభించారు. కాలక్రమేణా వంతెన దెబ్బతింది. స్థానిక ఎమ్మెల్యే చైతన్య సింగ్ ఝాలా ఇప్పటికే ఈ వంతెన గురించి హెచ్చరికలు జారీ చేశారు. గంభీర వంతెన శిథిలావస్థకు చేరుకుందని, దాని స్థానంలో కొత్త వంతెనను నిర్మించాలని అన్నారు. అయినప్పటికీ, వంతెనపై వాహనాల రాకపోకలు ఆపలేదు. గుజరాత్ ప్రభుత్వం రూ.212 కోట్ల వ్యయంతో కొత్త వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. వంతెన నిర్మాణం కోసం సర్వే కూడా నిర్వహించారు. కానీ వంతెనపై వాహనాలను అనుమతిస్తూనే ఉన్న క్రమంలో ప్రమాదం జరిగింది.
నిపుణుల బృందంతో విచారణకు సీఎం ఆదేశం
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సాంకేతిక నిపుణుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించారు. వంతెన కూలిన ఘటనపై ఆయన విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై నదిలో పడిపోయిన వాహనాలను తొలగిస్తున్నారు. అదే సమయంలో గజ ఈతగాళ్లు మృతదేహాలను వెలికితీశారు.
ఈ సంఘటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదేనా.. ప్రజల ప్రాణాల్లో గాల్లో కలిసి పోతున్నా ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నిస్తున్నారు. బ్రిడ్జి శిథిలావస్థ దశకు చేరుకుందని తెలిసినా, వాహనాల రాకపోకలకు ఎందుకు అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. రాకపోకలు నిలిపివేసి ప్రభుత్వం కొత్త వంతెన నిర్మాణం ప్రారంభించి ఉంటే, ఈ విషాదాన్ని నివారించి అవకాశం ఉండేదన్నారు.
మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం
గుజరాత్‌లోని వడోదర జిల్లాలో వంతెన కూలిన ఘటనలో భారీ నష్టం జరగడంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.