Janasena Chief Pawan Kalyan: అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా వేసుకున్నారు. దీనిపై జనసేన (Janasena) ఓ ప్రకటన విడుదల చేసింది. జనసేనాని భీమవరం పర్యటన విషయంలో ఆర్ అండ్ బి శాఖ మోకాలడ్డిందని జనసేన ఆరోపిస్తోంది. హెలీకాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారు. ఈ కారణంతో బుధవారం చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భీమవరం పర్యటన వాయిదా పడింది. పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తాం అని జనసేన ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి చెప్పారు. 






విష్ణు కాలేజీ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలీప్యాడ్ ల్యాండ్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరపెట్టడం వెనక అధికార పక్షం ఒత్తిళ్ళు ఉన్నట్లు అర్థమవుతోందని మహేందర్ పేర్కొన్నారు. విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారని గుర్తుచేశారు. కానీ పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉందన్నారు. ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ అండ్ బి అధికారులతో అనుమతుల విషయంలో మెలికలు పెట్టిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. 


3 దశల్లో జనసేన ఎన్నికల ప్రచారం చేయాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఫిబ్రవరి 14 నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో సమావేశాలు ఉంటాయని ఆ పార్టీ ఇటీవల తెలిపింది. కానీ తొలి సమావేశమే వాయిదా పడింది. పవన్ హెలికాప్టర్ కు ల్యాండింగ్ కు సంబంధించి అనుమతులు రాకపోవడంతో పవన్ పర్యటన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.