Xerox Shops In Grama Schivalayams : గ్రామ, వార్డు సచివాలయాల్లో త్వరలో జిరాక్స్ దుకాణాలు కనిపించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోంది. ఈ కారణంగా గ్రామ, వార్డు సచివాలాయల ద్వారానే ఆదాయం సంపాదించుకునే ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. ఇందులలో భాగంగా  భవనాల్లో కొంత స్థలాన్ని అద్దెకిచ్చే ప్రతిపాదన తెచ్చినట్లుగా తెలుస్తోంది.


సచివాలయంల 50 అడుగుల స్థలాన్ని అద్దెకిచ్చే యోచన


ఒక్కో సచివాలయ భవనంలో 50 చదరపు అడుగుల స్థలాన్ని స్టేషనరీ, జిరాక్స్‌ దుకాణాల నిర్వహణకు కేటాయించనున్నారు. వీటిపై వచ్చే అద్దెతో సచివాలయాల నిర్వహణతోపాటు స్టేషనరీ ఖర్చులనుంచి బయటపడొచ్చని అధికారులు ఓ నివేదిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. కలెక్టర్లతో గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు  ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు.  సచివాలయాల్లో స్థలాన్ని అద్దెకు ఇచ్చేందుకు ఈలోగా ఏర్పాట్లు చేయాలని, త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. 


కార్యాలయం నిర్వహణ ఖర్చులకు వస్తాయని అంచనా 


50 చదరపు అడుగుల స్థలంపై నెలకు అద్దె రూ.వేయి, విద్యుత్తు ఛార్జీల కింద మరో రూ.200 చొప్పున మొత్తం రూ.1,200 రాబట్టాలన్నది ప్రణాళిక. దుకాణాల ఏర్పాటుకు స్థలాన్ని ఎవరికి ఇవ్వాలి ? వారితో ఒప్పందం ఎలా చేసుకోవాలనే బాధ్యతలను ఎంపీడీవోల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ప్రకారం త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో జిరాక్స్, స్టేషనరీ దుకాణాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 


గతంలో ఫిష్ మార్టులు పెట్టాలనే ప్రయత్నం !


కొద్ది రోజుల కిందట ఫిష్ ఆంధ్రా స్టాళ్లను కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన అధికారులు చేశారు.  కలెక్టర్లు కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో చేపల అమ్మకాల కోసం ప్రత్యేకంగా స్టాళ్ల నిర్మాణం కోసం దిగువ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది.  ప్రభుత్వం ఫిష్ ఆంధ్రా హబ్‌లు ఏర్పాటు చేస్తుంది. వీటి ద్వారా చేపలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపుతారు. అక్కడ అమ్మకాలు చేస్తారు. ఫిష్ హబ్‌లు ఏర్పాటు చేసి.. వాటి పరిధిలోని 30 నుంచి 35 కిలోమీటర్ల పరిధిలో గ్రామ, వార్డు సచివాలయాలకు పంపుతారు. అయితే ఇది మాత్రం ఇంకా ప్రారంభం లేదు. ఫిష్ ఆంధ్రా స్టాల్స్ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో విరమించుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.