Chandrababu : వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాళ్లు వేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రైతాంగాన్ని సీఎం జగన్ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై  విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర భూములు తాకట్టు పెట్టి రూ.23 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. ఉత్తరాంధ్ర భూములు తాకట్టు పెట్టి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాలు, పరిశ్రమలు లేవని ఎద్దేవా చేశారు. జగన్‌ బటన్ ఇన్ కార్యక్రమం మొదలుపెట్టుకున్నారని విమర్శలు చేశారు. ప్రతి రోజు సాయంత్రం తన ఆదాయంపై లెక్కలు వేసుకుంటారన్నారు. మద్యం మొదలు అన్నింటా జగన్‌ కు అక్రమార్జన పెరిగిందన్నారు.  






అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు 


అక్రమ కేసులు, దాడులకు టీడీపీ నేతలు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రావాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కలిసి రావాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీని గాడిన పెట్టానన్నారు. టీడీపీది విజన్ అయితే వైసీపీది విధ్వంసమని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు కాన్వాయ్ పై కొందరు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో చంద్రబాబు భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయమైంది. ఈ ఘటనపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. కొందరు అసమర్థులు దొంగల మాదిరి రాయి విసిరారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన పర్యటనలో పోలీసుల భద్రత సరిగా లేకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.  వైసీపీ గూండాలూ ఖబడ్దార్‌ అంటూ మండిపడ్డారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదన్నారు. పులివెందుల రాజకీయాలు చేయొద్దని జగన్‌ను కోరుతున్నానని చంద్రబాబు అన్నారు.  వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయన్నారు.   


రోడ్ షో లో ఉద్రికత్త  


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నందిగామ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోలో రాళ్ల దాడి చేశారు గుర్తుతెలియన వ్యక్తులు.  ఈ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ అధికారి  మధు గాయపడ్డారు. రాయి విసిరిన సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.  పోలీసుల భద్రతా వైఫల్యంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాళ్ల దాడి జరిగిన తర్వాత ఆయన చుట్టూ.. సెక్యూరిటీ సిబ్బంది మోహించారు. అంతకుముందు చంద్రబాబు రోడ్‌షోలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్‌షో తొందరగా ముగించాలంటూ టీడీపీ నేతలపై పోలీసుల ఒత్తిడి తెచ్చారు.  రోడ్‌షోకు భారీగా జనం తరలిరావడంతో అదనపు పోలీస్‌ బలగాలు రంగంలోకి దిగాయి. చంద్రబాబు వాహనానికి ముందు, వెనుకా పెద్దఎత్తున రోప్ పార్టీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వాహనం చుట్టూ అదనపు భద్రతా బలగాలు ఏర్పాటు చేశారు.