కంచుకోటలు బద్దలైనప్పటికీ తెలుగు తమ్ముళ్లలో మాత్రం తమ అసమ్మతి రాజకీయాలు తప్పితే టీడీపీని పటిష్ట పరిచే విధంగా మాత్రం వ్యవహరించడం లేదు. రాయలసీమ జిల్లాలోనే టీడీపీకి గట్టి పట్టున్న అనంతపురం జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పన్నెండు ఎమ్మెల్యే స్థానాలతో పాటు, రెండు ఎంపీ స్థానాలను గెలుచుకొంది. అలాంటి జిల్లాలో టీడీపీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని దిద్దుబాటు సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని అనంతపురం జిల్లా నేతలతో సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల సూచించారు. కానీ అందుకు విరుద్దంగా జిల్లాలో అనేక స్థానాల్లో అసమ్మతి కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ సతమతం అవుతోంది.


కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో గత ఎన్నికల నుంచి మాజీ ఎంఎల్ఏ ఉన్నం హనుమంతరాయ చౌదరి, ప్రస్తుత ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు వర్గాల మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. ఎంతలా అంటే.. ఇరువర్గాలు అన్నివేదికల మీద భౌతిక దాడులకు పాల్పడే విధంగా పరిస్థితి కనిపనిస్తోంది. సోషల్ మీడియాలో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగానే పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. మాజీ ఎంఎల్ఏ ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలోనే నియోజకవర్గంలోనే మిగిలిన ముఖ్య నేతలంతా ఒక వర్గంగా ఏర్పడ్డారు. ప్రస్తుత ఇంఛార్జి ఉమా మహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో మరికొంతమంది ముఖ్య నేతలంతా ఉన్నారు. అయితే ఇరువర్గాలు కూడా పోటాపోటీగా కార్యక్రమాలు నడిపిస్తున్నారు.


కళ్యాణదుర్గంలో గతంలో ఉన్నం హనుమంతరాయ చౌదరికి వ్యతిరేకంగా ప్రస్తుత ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలోనే పనులు చేశారు. అయితే ఎవరైతే ఉన్నం హనుమంతరాయ చౌదరికి వ్యతిరేకంగా పనిచేశారో వారంత మళ్లీ ఆయన మార్గదర్శకత్వంలోనే కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుత ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు అందరిని కలుపుకొని వెల్లలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే అందరూ ఆయనకు దూరం అవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే పార్టీ నియమావళికి విరుద్దంగా ఇంఛార్జిని కాదని అసమ్మతి కార్యక్రమాలు ఉన్నం హనుమంతరాయ చౌదరి నిర్వహిస్తున్నారని ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు.


ఇప్పటివరకు మండలాల కన్వీనర్లు అంతా ఉమామహేశ్వర నాయడు ఆధ్వర్యంలో పనిచేస్తన్నప్పటికి, నియోజకవర్గంలోని ముఖ్యనేతలైన మల్లిఖార్జున, కంబదూరు రాంమోహన్ నాయుడు, వైపి రమేష్ తదితర నేతలంతా ఉన్నం చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు. ఉమామహేశ్వర నాయడు జెసీ వర్గంలో ముఖ్యమైన నేత అని ప్రచారంలో ఉంది. కానీ ఇటీవల కాలంలో జెసీ పవన్ వర్గానికి చెక్ పెట్టేందుకు జిల్లాలో ఇతర నేతలంతా కలిసి తీవ్ర ప్రయత్నాలు  చేస్తున్నారు. ఇక్కడ కూడా జెసీ పవన్ వర్గంగా ముద్రపడ్డ ఉమామహేశ్వర నాయుడుకి వ్యతిరేకంగా ఉన్నం వర్గంకి మద్దతుగా జిల్లాలోనే ముఖ్యనేతలు మద్దతిస్తున్నారు. 


అనంతపురం జిల్లా నేతల మద్దుతు ఉండడం,స్థానికులకు టికెట్ ఇవ్వకూడదన్న డిమాండ్ తో ఉన్నం వర్గీయులు నియోజకవర్గంలో అసమ్మతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఉన్నం వర్గీయులకు అప్పుడే పార్టీ అధిష్ఠానం చెక్ పెట్టి ఉండే ఇప్పుడు టీడీపీ పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు ఉమా వర్గీయలు. కంచుకోటలో ఇవేమీ రాజకీయాలు అని  టీడీపీ సెకండ్ క్యాడర్ లీడర్లు.. పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ మొదట్లోనే వీటికి చెక్ పెడితే తప్ప రానున్న ఎన్నికలకు సన్నద్దం అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కళ్యాణదుర్గం టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తాడా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు.
Also Read: AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... కొత్త డీఏ విడుదలకు ఉత్తర్వులు


Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. వరుసగా మూడో రోజు స్థిరంగా బంగారం, వెండి నేల చూపులు


Also Read: Drugs in Gujarat: గుజరాత్‌లో మరోసారి మత్తు భూతం.. పాక్ బోటులో రూ.400 కోట్ల డ్రగ్స్ సీజ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి