Chandrababu Meets Erik Solheim: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ జరుగుతున్న రీ ఇన్వెస్ట్ ఫోరమ్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు ఆ సదస్సులో పాల్గొన్నారు. సీఎం కూడా ఎంతో మంది ప్రపంచ ప్రముఖులను కలుస్తున్నారు. అదే వేదికపై నార్వేకు చెందిన మాజీ పర్యావరణ మంత్రి ఎరిక్ సోల్హీమ్ కూడా కలిశారు. ఈయన రెండు సార్లు నార్వే ప్రభుత్వంలో ముఖ్యమైన పదవుల్లో పని చేశారు. ఐక్యరాజ్య సమితిలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.


అలాంటి సోల్హీమ్ గుజరాత్‌లో చంద్రబాబును కలిశారు. అనంతరం సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్టు చేస్తూ చంద్రబాబు గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరో సీఎం కావడంతో ఇక ఏపీ మరో స్థాయికి వెళ్తుందని, ఉన్నత శిఖరాలను చేరుతుందని సోల్హీమ్ పోస్ట్ చేశారు.


‘‘నారా చంద్రబాబు నాయుడును కలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. గుజరాత్‌ రాష్ట్రంలోని రీ ఇన్వెస్ట్ ఫోరమ్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎంను కలిశాను. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి ఎన్నికయ్యారు. ఆయన తన రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను.


భారతదేశంలోని సీఎంలలో కొందరికే చంద్రబాబు లాంటి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను దక్షిణ భారతదేశంలోనే సిలికాన్ వ్యాలీగా మార్చడానికి నాయకత్వం వహించారు. గ్లోబల్ ఐటీనాయకులతో కలిసి పని చేశారు. ఎంతో విశాలమైన ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను హైదరాబాద్ లో స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన హైదరాబాద్‌ను భారతదేశంలోని అత్యంత ఆధునిక నగరాల్లో ఒకటిగా మార్చారు. అందమైన ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు మనం ఏవిధంగా సహాయం చేయవచ్చో మేం ఈ సందర్భంగా చర్చించాం.


గ్లోబల్ రెన్యూవబుల్స్ అలయన్స్, ఇంటర్నేషనల్ గ్రీన్ ఎనర్జీ కమ్యూనిటీకి చెందిన ఇతర భాగస్వాములు కలిసి పెట్టుబడిదారులను సమీకరించడానికి మేం సహాయం చేస్తాము. చెట్ల పెంపకం, మడ అడవుల పునరుద్ధరణ, హరిత వ్యవసాయానికి ఆర్థిక సహాయం చేయడానికి, ఇతర కంపెనీలు కార్బన్ క్రెడిట్స్ ను తీసుకురావడానికి సహకారం చేస్తాయి. సహజ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రపంచ అగ్రగామిగా ఉంది. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రాను ఫాలో అవడం అందరికీ ముఖ్యం!’’ అని ఎరిక్ సోల్హీమ్ కొనియాడారు.






స్పందించిన చంద్రబాబు
దీనిపై చంద్రబాబు కూడా స్పందించారు. ‘‘థ్యాంక్యూ ఎరిక్ సోల్హీమ్! మీ అందరినీ రీఇన్వెస్ట్ 2024 కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు అద్భుతమైన వనరులు ఉన్నాయి. సుస్థిర వ్యవసాయంపై మనం చర్చించిన పురోగతి ఇదొక ఉదాహరణ. గ్రీన్ ఫ్యూచర్ కోసం మన ప్రయాణాన్ని వేగవంతం చేసేలా పునరుత్పాదక ఇంధనంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా మార్చే సహకారాలను ఏర్పరచుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను’’ అని చంద్రబాబు స్పందించారు.