Fake news on Minister Sandhyaranis birthday celebrations : ఆంధ్రప్రదేశ్ మంత్రి సంధ్యారాణి పుట్టిన రోజు వేడుకలు తిరుమలలోని ఓ గెస్ట్ హౌస్ లో థూం..థాంగా జరిగాయని అందరూ తాగి గంతులేశారని వైసీపీ సోషల్ మీడియా సానుభూతిపరులు ఓ వీడియోను ప్రచారంలోకి పెట్టారు.ఈ వీడియో వైరల్ అయింది. అయితే నిజమేమిటంటే.. ఆ పుట్టిన రోజు వేడుకలు జరిగింది విజయవాడలోని మంత్రి నివాసంలో. కానీ తిరుమలలో జరిగాయంటూ ప్రచారం చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ఇలాంటి ప్రచారాలు చేస్తే.. చట్టపరమైన చర్యలు తీుకుంటామని హెచ్చరించారు.
ఇది మతపరమైన అంశం కావడం.. మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు చేసిన కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కూడా ఈ అంశంపై దృష్టి సారించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుమలలో జరగని వేడుకల్ని తిరుమలలో జరిగినట్లుగా ప్రచారం చేసిన వారిని గుర్తించి కేసులు పెట్టనున్నారు.
ఈ ప్రచారంపై నారా లోకేష్ స్పందించారు. వైసీపీకి అనుబంధంగా ఉండే ఓ వెబ్ సైట్ చేసిన ట్వట్ ను ఆయన ఫేక్ గా చెబతూ.. శ్రీవారితో పెట్టుకోవద్దని జగన్ ను హెచ్చరించారు. ఏడుకొండలపై నీ విష రాజకీయాలు వాడొద్దు..ఒక్క సీటు కూడా లేకుండా పోతావని మండిపడ్డారు.
వైరల్ చేసిన కుక్కలను దేవుడే శిక్షిస్తాడన్న మంత్రి
తమపై చేసిన తప్పుడు ప్రచారంపై మంత్రి స్పందించారు. 'ఆ వీడియో గత నెల 29న నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని నివాసంలో సెలబ్రేట్ చేసుకున్నదని తెలిపారు. తిరుమల దర్శనం కోసం వెళ్లినా పద్మావతి గెస్ట్ హౌస్‌లో ఉండలేదన్నారు. వీడియో వైరల్ చేసిన కుక్కలను భగవంతుడే శిక్షిస్తాడన్నారు.
ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్ ప్రచారంలోకి వస్తోంది. వరదలకు కూడా కులాలను అంటగట్టి కుల ద్వేషాలను రెచ్చగొట్టేలా చాలా మంది పోస్టులు పెడుతున్నారు. వీరిలో చాలా మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినా వారు అలాంటి పోస్టులు కొనసాగిస్తూండటంతో. త్వరలో చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.