ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి విద్యుత్ కోతలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలకు అవసరమైన విద్యుత్‌ను అందిస్తున్నామని ఎక్కడా విద్యుత్ కోతలను అమలు చేయడం లేదని ఏపీ ఇంధన శాఖ అధికారికంగా ప్రకటించింది. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట 16వ తేదీ నుంచి అంటే శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు అమలవుబోతున్నట్లుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఈ అంశంపై ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఎక్కడా కరెంట్ కోతలు లేవని తెలిపారు. 


Also Read : ఏపీలో 1.62 లక్షల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ ట్రైనింగ్.. 40 కోర్సుల్లో సర్టిఫికేషన్..


ఆంధ్రప్రదేశ్‌లో  ఇటీవలి కాలంలో విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల అనధికారికంగా విద్యుత కోతలు అమలవుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం కూడా పదే పదే ప్రజలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. ఏపీలో విద్యుత్ ఉత్పత్తికి, వినియోగానికి మధ్య చాలా తేడా ఉంది. పెద్ద ఎత్తున కరెంట్‌ను పవర్ ఎక్స్ఛేంజ్‌ల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ పెరగడంతో యూనిట్ ధర రూ. ఇరవై వరకూ వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో  డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్‌ను సరఫరా చేయడం ఏపీ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది.


Also Read : జగన్ ప్రభుత్వంపై డీఎల్ విమర్శలు ! గుర్తించలేదనే అసంతృప్తే కారణమా ?


ఓ వైపు బొగ్గు కొరత , మరో వైపు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ప్రజలను హెచ్చరించింది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని సూచించింది. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్‌లో కరెంట్ కోతలు విధించాల్సి రావొచ్చని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. అంతే కానీ కోతలు విధిస్తామని చెప్పలేదు. అధికారికంగా ఏపీ ఇంధన శాఖ ఎలాంటి ప్రకటనలు చేయకుండానే సోషల్ మీడియాలో మాత్రం పండుగ అయిపోయిన తర్వాతి రోజు నుంచి కరెంట్ కోతలు అనే ప్రచారం ప్రారంభమయింది. 


Also Read : ఏపీలో బొగ్గు కొరతపై జగన్ రివ్యూ.. కరెంటు కోతలు ఉండొద్దని ఆదేశాలు


మూడు రోజుల కిందట విద్యుత్ రంగ పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్  బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా కొనుగోలు చేయాలని .. కరెంట్ కోతలు మాత్రం ఉండకూడదని ఆదేశించారు. ఆ ప్రకారం విద్యుత్ డిమాండ్‌ను అందుకునేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారికంగా కరెంట్ కోతలు విధించడం లేదని.. విధించే అవకాశం లేదని ప్రజలకు ప్రభుత్వ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. 


Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి