వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై సొంత పార్టీ నేతల అసంతృప్తి గళాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎంపీ  రఘురామకృష్ణరాజు వంటి వారు రెబల్‌గా మారగా మరికొంత మంది నేరుగా మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉందన్నారు. అన్ని శాఖల్లో వేలు పెడుతున్న సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీరుపైనా మండిపడ్డారు. 


Also Read : ఏపీలో బొగ్గు కొరతపై జగన్ రివ్యూ.. కరెంటు కోతలు ఉండొద్దని ఆదేశాలు


ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందని... రైతును పట్టించుకునే నాథుడే కరువయ్యాడని డీఎల్ మైదుకూరులోప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేశారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఆయిల్ వ్యాపారం చేసే అంబటి కృష్ణారెడ్డికి వ్యవసాయ శాఖలో సలహాదారుడి పదవి ఇచ్చారని మండిపడ్డారు. తప్పు చేసిన వాడు తప్పకుండా జైలుకు పోతాడు. ప్రభుత్వం ఇచ్చే ఐదు వందలు, వెయ్యికి ఆశపడి ఎవరు బ్రతక వద్దు. సొంతంగా సంపాదించుకోవడం నేర్చుకోవాలని ప్రజలకు సలహా ఇచ్చారు. 


Also Read : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలాఖరుకు పీఆర్సీ !


రాష్ట్రంలో జరుగతున‌న అక్రమాలపై పాలకులను మీడియా ప్రశ్నించాలని.. ప్రశ్నించుకుంటే అధోగతి పాలవుతుందని హెచ్చరించారు.   భూములు ఆక్రమించుకోవడం ఖజానా నింపుకోవడమే పాలకుల పనిగా మారిందన్నారు. రాష్ట్ర పరిస్థితి, భావితరాల గురించి ఎవరు ఆలోచన చేయడం లేదున్నారు.  రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారిపోయారు. రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదని, దారినపోయే వారంతా మీడియా సమావేశాలు పెడుతున్నారంటూ పరోక్షంగా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు గుప్పించారు. 


Also Read : రాజకీయ విమర్శలపై ప్రతిపక్షాలు, మీడియాకు ఏపీ డీజీపీ పరువు నష్టం నోటీసులు ! దేశంలోనే మొదటి సారి !


కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన డీఎల్ రవీంద్రారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరిగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నా గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరేందుకు  సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాశ్ రెడ్డి పలు హామీలు ఇచ్చారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో మైదుకూరు వైసీపీ అభ్యర్థి రాఘురామిరెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గెలుపులో కీలకంగా మారారు. ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు.  అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. మైదుకూరు రాజకీయాల్లో కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. దీంతో డీఎల్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని డీఎల్ రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనని.. ప్రకటించారు.

 


 


Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి