AP News :  ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ నేతగా ఉన్నప్పుడు ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి ఘటనలో కుట్ర కోణం లేదని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు టీడీపీ సానుభూతి పరుడు కాదని తెలిపింది. అలాగే ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్‌కు అసలు ఈ ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కోర్టులో ఎన్‌ఐఏ తరపున కౌంటర్ దాఖలు చేశారు. 


లోతుగా విచారించాలన్న జగన్ పిటిషన్ కు ఎన్‌ఐఏ కౌంటర్ 


గత వాయిదాలో   సీఎం జగన్ తరపు న్యాయవాది రెండు పిటిషన్ లు దాఖలు చేశారు.   విచారణకు రాకుండా మినహాయింపు ఇవ్వాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు అడ్వకేట్ కమిషనర్ను నియమించాలని కోరుతూ పిటిషన్ వేశారు. అలాగే   కోడి కత్తి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీయడంలో ఎన్ఐఏ ఫెయిల్ అయిందని ఆ దిశగా విచారణ పూర్తి స్థాయిలో చేపట్టేలా ఎన్ ఐ ఏ ను ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుతో పాటు ఎన్ఐఏను కోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ అసలు ఈ ఘటనలో కుట్ర కోణం లేదని తేల్చి చెప్పింది.  


కుట్ర లేదని తేల్చిన ఎన్‌ఐఏ 


ఇంకా లోతుగా విచారణ చెయ్యాలని వేసిన పిటిషన్ను కొట్టివేయాలని  ఎన్‌ఐఏ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు తరపు లాయర్లు కూడా కౌంటర్ దాఖలు చేశారు.  నిందితునికి ఏ పార్టీకి సంబంధం లేదని ఎన్ ఐ ఎ కౌంటర్ లో తెలిపిందిని నిందితుడి తరపు లాయర్లు చెప్పారు.  సీ సీ టీవీ ఫుటేజ్ సేకరించామని ... రెస్టారెంట్ యజమానికి దాడితో సంబంధం లేదని తమ దర్యాప్తులో తేలినట్లు ఎన్ ఐ ఏ కౌంటర్ లో తెలిపిందన్నారు.  ఈ కౌంటర్లపై వాదించేందుకు సమయం కావాలని సీఎం జగన్ తరపు న్యాయవాది సమయం అడగడంతో  తదుపరి విచారణను పదిహేడో తేదీకి ఎన్ ఐఏ కోర్టు వాయిదా వేసింది. 


లోతైన  విచారణ కోసం పైకోర్టుకు వెళ్తారా ?


విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌పై దాడి చేసిన నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నారు.  దాడి జరిగిన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న  సీఎం జగన్ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని ఎన్ఐఏ విచారణ చేయించాని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ విచారణ జరిపింది. చార్జిషీటు దాఖలు చేసింది. అయితే విచారణ ప్రారంభమయ్యే సమయంలో సీఎం జగన్ కుట్ర కోణం వెలికి తీయలేదని మరింత లోతుగా విచారణ జరపాలని పిటిషన్ వేయడం చర్చనీయాంశమయింది. అయితే ఎలాంటి  కుట్రా లేదని.. ఎన్ఐఏ స్పష్టం చేయడంతో తదుపరి సీఎం జగన్ న్యాయవాదుల బృందం ఎలాంటి అడుగులు వేస్తుంది.. పైకోర్టుకు వెళ్లి మరింత లోతైన దర్యాప్తు కోసం ప్రయత్నిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.