మచిలీపట్టణానికి చెందిన విభిన్న ప్రతిభావంతురాలు సీమ పర్వీన్‌కు పెన్షన్ తొలగింపుపై తెలుగు దేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సమస్య ఎదురుగా కనిపిస్తున్నా మానవత్వంతో స్పందించలేని జగన్ సర్కార్ మనకు అవసరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. మచిలీపట్టణం పర్యటనలో భాగంగా చంద్రబాబు పలువర్గాలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీమ పర్వీన్ పింఛన్‌ విషయమై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించపోవటంపై పలు వర్గాలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.


ఇంట్లో 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడుతున్నారని 90 శాతం వైకల్యంతో బాధపడుతున్న పర్వీన్ పెన్షన్ తొలగింపును తెలుగు దేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. బందరులో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో వేదిక పైకి పర్వీన్ తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు తమ సమస్య గురించి వివరించారు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమ పర్వీన్‌కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి అధికారులు మనసెలా వచ్చిందని చంద్రబాబు నాయుడు అన్నారు. 18 ఏళ్లు వచ్చినా వైకల్యం కారణంగా తల్లిదండ్రులు చేతులపైనే పెరుగుతున్న పర్విన్ కు పెన్షన్ తొలగిస్తారా? మీకు మానవత్వం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా అని చంద్రబాబు అన్నారు. పెన్షన్‌కు నాడు అర్హురాలు, నేడు అనర్హురాలు ఎలా అయ్యిందో చెప్పాలన్నారు. 90శాతం వైకల్యం ఉన్న అమెకు నిబంధనల పేరుతో పెన్షన్ తొలగించడమే మీ మానవత్వమా అని బాబు వ్యాఖ్యానించారు. 


వాస్తవంగా చెప్పాలి అంటే వైకల్యంతో ఉంది ఆమె కాదు రాష్ట్ర ప్రభుత్వమే అని చంద్రబాబు భాదితురాలిని చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. సంక్షేమ పథకాల్లో ఆంక్షలతో కోతలపై సమాధానం చెప్పాలి అంటూ సీఎం జగన్‌కు చంద్రబాబు ట్వీట్ చేశారు.






మచిలీపట్టణం సభలో బాబు ఫైర్...
మచిలీపట్నంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను గురించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అర్థరాత్రి మీటింగ్‌కు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావటంతో పార్టీ శ్రేణులు సైతం ఉత్సాహం వ్యక్తం అయ్యింది. ఈ సభ ద్వార క్యాడర్‌కు పట్టుదల పెరిగిందని చంద్రబాబు అన్నారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయిందని అర్థమవుతుందని బాబు అన్నారు. ఈ రాష్ట్రానికి జగన్ క్యాన్సర్ లాంటి వ్యక్తని అని విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్న చంద్రబాబు తన ఆలోచన తన బాధ ఎప్పుడూ రాష్ట్రం గురించేనన్నారు. వైసీపీ పోతే తప్ప ప్రలకు మంచి భవిష్యత్ లేదన్నారు.


వైసీపీ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని, జగన్ బటన్ నొక్కి ఇచ్చిన సొమ్ము గురించి చెబుతున్నారని, బటన్ నొక్కి ఎన్ని లక్షల కోట్లు తిన్నవో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఆడవారికి ఆస్తిలో హక్కు ఇచ్చింది ఎన్టీఆర్‌ అని, డ్వాక్రా సంఘాలు పెట్టింది తానేనన్నారు. 2014 నుంచి ఒక్కో డ్వాక్రా మహిళలకు 20,000 ఇచ్చానని చెప్పారు. అన్నా క్యాంటీన్ పెడితే జగన్ దాన్ని మూసేశారని, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, రంజాన్ తోఫా వంటి పథకాలు అన్ని రద్దు చేసిన ప్రభుత్వం అవసరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ప్రజాధనం దోచుకుని బొక్కింది రూ. 2 లక్షల కోట్లని ఆరోపించారు. జిల్లాలో ఇసుక బంగారం అవ్వడానికి కారణం ఎవరో అందరికి తెలుసని చంద్రబాబు అన్నారు. జగన్ వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు చంద్రబాబు. ఇసుక ఎక్కడికి పోతుందో స్థానిక ఎమ్మెల్యే పేర్నినాని చెప్పగలరా అని ప్రశ్నించారు.