Selfie Challenge Politics :  సెల్ఫీ చాలెంజ్‌లు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. పాదయాత్ర ప్రారంభం రోజు నుంచి నారా లోకేష్ ఇలాంటి సెల్ఫీ చాలెంజ్‌లు చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ నెల్లూరులో టిడ్కో ఇళ్ల వద్ద  మాజీ సీఎం చంద్రబాబు ఫోటోలు తీసుకుని చేసిన సెల్ఫీ చాలెంజ్ మాత్రం వైరల్ అయింది. అలాంటి అభివృద్ధి ఎక్కడైనా చేసి ఉంటే సెల్ఫీ లు తీసి పెట్టాలని చంద్రబాబు జగన్ ను డిమాండ్ చేశారు.  సెల్ఫీ చాలెంజ్ పై సీఎం జగన్ మార్కాపురంలో స్పందించారు. ప్రతి ఇంటికి  మేలు చేశామని.. ప్రతీ ఇంటి ముందు సెల్ఫీ దిగి పోస్ట్ చేయాలని ఆయన పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ సెల్ఫీలు పెరిగిపోయాయి. 


సెల్ఫీ చాలెంజ్ ను టాస్క్ గా పెట్టుకున్న టీడీపీ 


యువగళం పాదయాత్రలో నారా లోకేష్ భిన్నమైన పంథాలో వెళ్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికిసెల్ఫీల చాలెంజ్ ను ఎంచుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఘాటుగా విమర్శించడానికి స్పీచ్‌లలో ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో పాదయాత్రలో తనకు ఎదురుపడిన అంశాలు, ప్రజల కష్టాలకు ప్రభుత్వం కారణం ఎలాగో వివరిస్తూ సెల్ఫీలు తీస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చాలెంజ్ విసురుతున్నారు. ఇవి వైరల్ అవుతున్నాయి. తాను తీసుకు వచ్చిన పరిశ్రమను చూపించి ఆ పరిశ్రమ ముంతు సెల్ఫీ దిగుతున్న లోకేష్.. జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన ఒక్క పరిశ్రమ విషయంలో అలా సెల్ఫీ తీసుకుని చూపించాలని సవాల్ చేస్తున్నారు, ఇలాంటి సెల్ఫీ చాలెంజ్ లు ప్రతీ రోజూ ఉంటున్నాయి. నెల్లూరు పర్యటనలో చంద్రబాబు కూడా అదే చేశారు. టిడ్కోఇళ్ల దగ్గర సెల్ఫీ దిగి చేసిన చాలెంజ్ వైరల్ దీంతో వైఎస్ఆర్‌సీపీ నేతలు తాము సెల్ఫీలు దిగితే తట్టుకోలేరని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ విమర్శలు ఇలా వస్తున్న సమయంలోనే ... సీఎం జగన్ కూడా.. చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్  పై మండిపడ్డారు. 


సోషల్ మీడియాతో  వైఎస్ఆర్‌సీపీని ఇరుకున పెడుతున్న టీడీపీ
 
ప్రభుత్వ వైఫల్యాలను హైలెట్ చేయడానికి  టీడీపీ అగ్రనేతలు ఈ సెల్ఫీల వ్యూహం అమలు చేస్తున్నారు.  ప్రస్తుత రాజకీయంలో సోషల్ మీడియా అత్యంత కీలకంగా మారింది.  పాదయాత్రలో అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టాలని ప్రత్యేకంగా ప్రయత్నిస్తూండటంతో  ఇలాంటిసెల్ఫీ చాలెంజ్‌లకు కొదవ ఉండటం లేదు. కనీస సౌకర్యాలు అందించలేకపోతున్న ప్రభుత్వం బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తోందని ఓ బెల్ట్ షాపు వద్ద లోకేష్ సెల్ఫీ తీశారు.  ఫిష్ ఆంధ్రా పేరుతో ఏర్పాటు చేసిన దుకాణాలు మూతపడ్డాయని చూపించారు. అలాగే  తాము తీసుకు వచ్చిన పరిశ్రమల ముందు సెల్ఫీలు దిగి ఇలాంటి పరిశ్రమల్ని ఎన్ని తీసుకు వచ్చారో వాటి ముందు సెల్ఫీ దిగి చూపించాలని సవాల్ చేస్తున్నారు.   ఇలా ప్రభుత్వ వైఫల్యాలతో పాటు తాము సాధించిన విజయాలను కూడా… హైలెట్ చేస్తూ సెల్ఫీ చాలెంజ్‌లను లోకేష్ కంటిన్యూ చేస్తున్నారు.


సంక్షేమానికే వైఎస్ఆర్‌సీపీ ప్రాధాన్యం.. అందుకే సెల్ఫీల్లో తడబాటు !


ప్రతి ఇంటికి మంచి చేశామని..  టీడీపీ హయాంలో ప్రతి కుటుంబానికి ఎంత మంచి జరిగింది.. తమ హయాంలో ఎంత మంచి జరిగిందో వివరించాలని సీఎం  జగన్ పిలుపునిచ్చారు.  ప్రతీ ఇంటి ముందు సెల్పీ దిగి  ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ సంక్షేమం సెల్ఫీల్లో కనిపించదు. సెంటు, సెంటున్నర స్థలాల్లో ఇంకా  ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. చాలా చోట్ల ప్రారంభం కాలేదు. వాటి దగ్గర సెల్ఫీలు దిగే పరిస్థితి లేదు. ఇతర అభివృద్ధి పనులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అదే సమయంలో తమది సంక్షేమబావుటా  అని చెప్పుకునేందుకు  ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ సెల్ఫీల రాజకీయం మాత్రం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.